యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ తీసుకువచ్చిన కొత్త ఈక్విటీ నిబంధనలు-2026పై దేశవ్యాప్తంగా చెలరేగుతున్న నిప్పులకు సుప్రీంకోర్టు తాత్కాలికంగా అడ్డుకట్ట వేసింది. కుల వివక్షను రూపుమాపాలనే లక్ష్యంతో తెచ్చిన ఈ నిబంధనలు, సమాజాన్ని విడదీసేలా ఉన్నాయంటూ అత్యున్నత న్యాయస్థానం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు 2012 నాటి పాత నిబంధనలనే అనుసరించాలని స్పష్టం చేస్తూ, కొత్త రూల్స్‌పై స్టే విధించింది. యూనివర్సిటీల్లో పెరుగుతున్న కుల వివక్షను అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం యూజీసీ ద్వారా ప్రమోషన్ ఆఫ్ ఈక్విటీ రెగ్యులేషన్స్ 2026ను తీసుకువచ్చింది. అయితే ఈ నిబంధనలు కేవలం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు మాత్రమే రక్షణ కల్పిస్తున్నాయని, జనరల్ కేటగిరీ విద్యార్థుల ప్రయోజనాలను విస్మరిస్తున్నాయని ఆరోపిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్య బాగ్చీల ధర్మాసనం అత్యంత కీలకమైన వ్యాఖ్యలు చేస్తూ నిబంధనల అమలును నిలిపివేసింది. న్యాయస్థానం తన విచారణలో యూజీసీని గట్టిగా నిలదీసింది. "కేవలం కుల వివక్ష అని ఎందుకు పేర్కొన్నారు? వివక్ష అంటే ఏదైనా కావొచ్చు కదా. ర్యాగింగ్ వంటి అంశాలను ఎందుకు చేర్చలేదు?" అని ప్రశ్నించింది. అంతేకాకుండా వర్సిటీల్లో ప్రత్యేక హాస్టళ్లు, ప్రత్యేక కమిటీల ఏర్పాటు వంటి నిబంధనలు సమాజాన్ని విడదీసేలా ఉన్నాయని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. అమెరికాలో ఒకప్పుడు నల్లజాతీయులకు, తెల్లజాతీయులకు వేర్వేరు పాఠశాలలు ఉన్నట్లుగా మన దేశంలో కూడా అటువంటి విభజన దిశగా అడుగులు వేస్తున్నామా? అని జస్టిస్ బాగ్చీ ప్రశ్నించారు. విద్యాసంస్థలు భారతదేశ ఐక్యతను చాటిచెప్పేలా ఉండాలి కానీ, కులాల కుంపట్లుగా మారకూడదని హితవు పలికారు. ఈ నిబంధనలపై దేశవ్యాప్తంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఈ నిబంధనలను స్వాగతించగా, బీఎస్పీ అధినేత్రి మాయావతి కూడా వీటికి మద్దతు తెలిపారు. అయితే, సవర్ణ సేన వంటి సంస్థలు ఢిల్లీలో భారీ నిరసనలు చేపట్టాయి. యూజీసీ ఆఫీస్ ముందు విద్యార్థులు ఆందోళనలు చేస్తూ ఈ చట్టాన్ని నల్ల చట్టంగా అభివర్ణించారు. సామాజిక మాధ్యమాల్లో సైతం రోల్ బ్యాక్ యూజీసీ అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అయింది. పరిస్థితి తీవ్రతను గమనించిన కోర్టు, ఈ నిబంధనలు అమలైతే ప్రమాదకరమైన పరిణామాలు ఉంటాయని భావించి స్టే విధించింది. ప్రస్తుతానికి 2012 నాటి పాత నిబంధనలనే కొనసాగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. నిపుణుల కమిటీ ఈ కొత్త నిబంధనల్లోని లోపాలను సవరించాలని, అందరికీ సమాన న్యాయం జరిగేలా మార్పులు చేయాలని సూచించింది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ నిబంధనలు ఎవరినీ వేధించడానికి ఉద్దేశించినవి కావని హామీ ఇచ్చినప్పటికీ, కోర్టు మాత్రం స్పష్టత లేని నిబంధనలు దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని అభిప్రాయపడింది.
إرسال تعليق