హైదరాబాద్‌లో ప్రముఖ రసాయన రంగ దిగ్గజ కంపెనీల్లో ఒకటైన బీఏఎస్‌ఎఫ్‌ తన గ్లోబల్ డిజిటల్ విస్తరణలో భాగంగా కొత్త 'గ్లోబల్ డిజిటల్ హబ్' ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కేంద్రం 2026 తొలి త్రైమాసికం నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. ఈమేరకు కేంద్రమంత్రి పీయుష్‌ గోయల్‌ ఆధ్వర్యంలో అధికారులు వివరాలు వెల్లడించారు. ప్రస్తుతం జర్మనీలోని లుడ్విగ్‌హాఫెన్, స్పెయిన్‌లోని మాడ్రిడ్, మలేషియాలోని కౌలాలంపూర్‌లో ఉన్న బీఏఎస్‌ఎఫ్‌ డిజిటల్ హబ్‌లున్నాయి. ఈ కేంద్రం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీ వ్యాపార విభాగాలకు వేగవంతమైన, తక్కువ వ్యయంతో కూడిన డిజిటల్ సేవలు అందనున్నాయి. ఈ ప్రాజెక్టు గురించి కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్, చీఫ్ డిజిటల్ ఆఫీసర్ డా.డిర్క్ ఎల్వెర్మాన్ మాట్లాడుతూ 'హైదరాబాద్‌లో ఈ హబ్ ఏర్పాటు చేయడం సంస్థలో విలువ జోడింపు దిశగా ఒక కీలక అడుగు. అంతర్జాతీయ స్థాయిలో పోటీని తట్టుకునే విధంగా తక్కువ వ్యయంతో డిజిటల్ సేవలను అందించడమే మా లక్ష్యం. ఒక గ్లోబల్ డిజిటల్ హబ్‌కు కావాల్సిన అన్ని అనుకూలతలు హైదరాబాద్‌లో ఉన్నాయి' అన్నారు. సంస్థ తన డిజిటల్ పోర్ట్‌ఫోలియోను సరళీకృతం చేస్తూ వ్యయాలను తగ్గించుకునే వ్యూహంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన డిజిటల్ సేవల విభాగంలో కీలక మార్పులు చేయాలని, తద్వారా సామర్థ్యాన్ని పెంచాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు.

Post a Comment

أحدث أقدم