గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అత్యంత డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ద్వారా 137 ఓపెన్ ప్లాట్లను బహిరంగ వేలం వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వేలం ప్రక్రియ ద్వారా సామాన్య , మధ్యతరగతి ప్రజలకు పారదర్శకమైన పద్ధతిలో సొంత ఇంటి స్థలాన్ని పొందే అవకాశం లభించనుంది. హైదరాబాద్ శివార్లలో వేగంగా అభివృద్ధి చెందుతున్న తొర్రూర్, బహదూర్‌పల్లి , కుర్మల్‌గుడ లేఅవుట్లలో ఈ 137 ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. ఎల్బీనగర్ వైపు ఉన్న వారికి తొర్రూర్, ఉత్తర హైదరాబాద్ వాసులకు బహదూర్‌పల్లి, మహేశ్వరం వైపు ఉన్న వారికి కుర్మల్‌గుడ లేఅవుట్లు అనువైనవి. ఈ మూడు ప్రాంతాలు కూడా ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలో ఉండటంతో వీటికి భారీ డిమాండ్ నెలకొంది. ఈ బహిరంగ వేలం ఫిబ్రవరి 7 , 8 తేదీలలో జరగనుంది. ప్రభుత్వం, హెచ్ఎండీఏ అధికారుల సమక్షంలో ఈ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తారు. ఆసక్తి ఉన్న కొనుగోలుదారులు నిర్ణీత గడువులోగా రిజిస్ట్రేషన్ ఫీజు , ముందస్తు ధరావత్తు చెల్లించి వేలంలో పాల్గొనవచ్చు. ప్లాట్లు వివిధ కొలతల్లో అందుబాటులో ఉన్నందున, వ్యక్తులు తమ బడ్జెట్‌కు అనుగుణంగా బిడ్ దాఖలు చేసే వెసులుబాటు కల్పించారు. ప్రభుత్వ లేఅవుట్లు కావడంతో ఈ ప్రాంతాల్లో ఇప్పటికే బీటీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, విద్యుత్ దీపాలు , తాగునీటి పైపులైన్ల వంటి మౌలిక సదుపాయాలను రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ అభివృద్ధి చేసింది. ప్రైవేట్ వెంచర్లతో పోలిస్తే చట్టపరమైన ఇబ్బందులు ఉండవనే నమ్మకంతో కొనుగోలుదారులు ఇక్కడి ప్లాట్లపై ఆసక్తి చూపుతున్నారు. 

Post a Comment

أحدث أقدم