తెలంగాణ మంత్రి కొండా సురేఖ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ ప్రముఖ నటుడు నాగార్జున, ఆయన కుటుంబంపై గతంలో తాను చేసిన వ్యాఖ్యలపై  చింతిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎవరినీ బాధపెట్టే ఉద్దేశ్యం తనకు లేదని సురేఖ స్పష్టం చేశారు. నాగార్జున, ఆయన కుటుంబాన్ని బాధపెట్టాలనే ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేయలేదని వెల్లడించారు. వారిని ఇబ్బందిపెట్టాలని గానీ, వారి పరువు ప్రతిష్టలకు భంగం కలిగించాలన్నది గానీ తన ఉద్దేశం కాదన్నారు. నాగార్జున కుటుంబంపై తాను చేసిన వ్యాఖ్యలలో ఏదైనా పొరపాటు ఉంటే అందుకు చింతిస్తున్నానని రాసుకొచ్చారు. తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని పోస్టులో తెలిపారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది. గతంలో మంత్రి కొండా సురేఖ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పై విమర్శలు చేసే సమయంలో సమంత పేరు ప్రస్తావనకు తీసుకొచ్చి నాగార్జున ఫ్యామిలీ పై సంచలన కామెంట్ చేయడం పెద్ద రచ్చే అయింది. నాగ చైతన్య - సమంత విడిపోవడానికి కారణం కేటీఆర్ అని ఆమె ఆరోపించింది. ఆమె చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సినీ, రాజకీయ నాయకులు కూడా స్పందించారు. దీనిపై నాగార్జున కూడా స్పందిస్తూ ట్వీట్‌ కూడా చేశారు. గౌరవ మంత్రివర్యులు మంత్రి కొండ సురేఖ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు ఆయన రాసుకోచ్చారు. దయచేసి సాటి మనుషులు వ్యక్తిగత విషయాలను గౌరవించాలని.. ఒక బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మహిళ మీరు వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. తమ కుటుంబంపై చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం అన్నారు. అక్కినేని నాగార్జున , కేటీఆర్ వేర్వేరుగా కొండా సురేఖపై పరువు నష్టం దావా వేశారు. తమ పరువుకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారని కేసులు వేశారు. ప్రస్తుతం ఈ కేసు ఇంకా నడుస్తున్న సమయంలో తన మాటలను వెనక్కి తీసుకున్నట్లుగా మంత్రి కొండా సురేఖ ట్వీట్‌ చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 

Post a Comment

أحدث أقدم