తెలంగాణలో  హెచ్‌ఎండీఏ పరిధిలోని గ్రామ పంచాయతీ లేఅవుట్లలో వెలిసిన వెంచర్లలో రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మూర్ఖపు చర్య అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. పేదలు, మధ్య తరగతి ప్రజల గురించి ఏమాత్రం ఆలోచించకుండా ఇలాంటి పిచ్చి నిర్ణయాలు తీసుకోవటం ఆశ్చర్యం కలిగిస్తోందని మండిపడ్డారు. పరిపాలనా అనుభవం లేకుండా తుగ్లక్‌ను తలపించేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలతో ప్రజలు అనేక ఇబ్బందులు పడాల్సి వస్తోందని ఆక్షేపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పేద, మధ్య తరగతి ప్రజలను టార్గెట్ చేసిందని ధ్వజమెత్తారు. మొన్నటి వరకు హైడ్రా, మూసీ పేరుతో పేదల గూడు కూల్చివేసిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు తాజాగా హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న పేదలు, మధ్య తరగతిని టార్గెట్ చేశారని అన్నారు. పేదలు, మధ్యతరగతి ప్రజల ప్లాట్లపైనా ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేసే కుట్ర జరుగుతోందని విమర్శించారు. హెచ్ఏండీఏ పరిధిలో ఉన్న జీపీ లేఅవుట్లలో వేసిన వెంచర్లలో ప్లాట్లు కొనుగోలు చేయడం ప్రజల తప్పా అని కేటీఆర్ ప్రశ్నించారు. ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని గుర్తు చేశారు. ఎన్నో ఏళ్లుగా ఆ ప్లాట్లు ఎంతో మంది చేతులు మారాయని.. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి రిజిస్ట్రేషన్లు చెల్లుబాటు కావంటే వారి పరిస్థితి ఏమవుతుందని ప్రశ్నించారు. ప్రభుత్వం ఏళ్ల తరబడి నెలకొన్న సమస్యలను పరిష్కరించాల్సింది పోయి.. లేని సమస్యలను సృష్టిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి చేస్తున్న పనులకు పేద, మధ్య తరగతి ప్రజలే సమిధలవుతున్నారని ఘాటుగా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలోనే వేలాదిగా గ్రామ పంచాయతీ లేఅవుట్లు వెలిశాయని, ఎంతో మంది చేతులు మారాయని వివరించారు. ఇప్పుడు వాటికి ఎవరిని బాధ్యుల్ని చేస్తారని ప్రశ్నించారు. భవిష్యత్‌లో పిల్లల చదువులు, పెళ్లిళ్ల కోసం పైసా పైసా కూడబెట్టుకొని పేదలు, మధ్య తరగతి ప్రజలు కొనుగోలు చేసిన ప్లాట్ల రిజిస్ట్రేషన్లు ఇప్పుడు చెల్లుబాటు కావంటే వారి పరిస్థితి ఏం కావాలో చెప్పాలని కేటీఆర్ ప్రశ్నించారు.

Post a Comment

أحدث أقدم