లులూ గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ ఎం.ఎ.యూసఫ్‌ అలీ మరోసారి వార్తల్లో నిలిచారు. యూఏఈకి చెందిన చంద్రశేఖరన్ పుతురుతి అనే యువతి అబుదాబీలోని ఓ షాపింగ్‌మాల్‌లో లులూ ఛైర్మన్‌ యూసఫ్‌ అలీని కలిసినట్లుగా సోషల్‌మీడియాలో వీడియో షేర్‌ చేయడంతో అది వైరల్‌గా మారింది. వీడియోలో ఆమె బిలియనీర్‌తో సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నిస్తుండగా అది గమనించిన అలీ ఆమె దగ్గరకు వచ్చి, నవ్వుతూ సరదాగా ఫోటోకు పోజులు ఇస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. యువతి ఆ వీడియోను షేర్‌ చేస్తూ ''జీవితంలో ఎంత గొప్ప స్థానానికి వెళ్లినా ఇతరులతో వినయపూర్వకంగా వ్యవహరించే గొప్ప వ్యక్తిని కలుసుకున్నాను. భారత బిలియనీర్‌ యూసఫ్‌ అలీని కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది'' అంటూ వ్యాఖ్యను జత చేశారు. వీడియో వైరల్‌గా మారడంతో నెటిజన్లు ఆయన గొప్ప మనసును, మంచితనాన్ని అభినందిస్తున్నారు. ఓ నెటిజన్‌ స్పందిస్తూ ''ఆయన జీవితం ఎందరికో ఆదర్శం. ఆయనకు నేను వీరాభిమానిని'' అంటూ రాసుకొచ్చారు. లులూ గ్రూప్‌కు సంబంధించిన ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్స్‌ ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. యూసఫ్ అలీ దీనికి ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఫోర్బ్స్ జాబితా ప్రకారం, అతని ఆస్తుల నికర విలువ $8.9 బిలియన్లకు పైగా ఉన్నాయి. వ్యాపారాల్లోనే కాకుండా ఆయన సామాజిక కార్యక్రమాల్లో కూడా చురుకుగా పాల్గొంటుంటారు. యూసఫ్‌అలీ ఇటీవల తన అభిమాని, యూట్యూబర్ ఎఫిన్‌కు రూ.2లక్షల ఖరీదైన వాచ్‌ను బహుమతిగా ఇచ్చి అతడిని ఆశ్చర్యపరిచారు.

Post a Comment

أحدث أقدم