వచ్చే ఏడాది మార్చి కల్లా ఎట్టి పరిస్థితిలో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరగాల్సిందేనని, అందుకు ఏర్పాట్లు చేసుకోవాలని జెన్‌కో అధికారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. సచివాలయంలో జెన్‌కో ఉన్నతాధికారులతో యాదాద్రి థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ పనుల ప్రగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటి యూనిట్‌ అక్టోబర్‌ 30.. ఐదో యూనిట్‌ను వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. ప్లాంట్‌లో పనిచేసే కొద్దిమంది అధికారులు, సిబ్బంది జ్వరాలతో బాధపడుతున్నారని.. ఫలితంగా పనుల్లో కొంత జాప్యం జరుగుతున్నట్లు సమావేశంలో అధికారులు వివరించారు. సిబ్బంది సంక్షేమమే ప్రధానమని.. వెంటనే మెడికల్‌ క్యాంప్‌ ఏర్పాటు చేయాలని.. దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అధికారులు, కార్మికుల భద్రతకు ఎన్ని నిధులు ఖర్చు చేసేందుకైనా వెనుకాడొద్దని సూచించారు. అధికారులు, కార్మికులు స్థానికంగా నివసించేందుకు వెంటనే క్వార్టర్ల నిర్మాణానికి టెండర్లు పిలవాలని ఆదేశించారు. స్థానికంగా నివసించేందుకు ఇబ్బందులు ఉన్నందున క్వార్టర్లు నిర్మించే వరకు మిర్యాలగూడ, దామరచర్ల నుంచి సిబ్బందిని తరలించేందుకు ప్రత్యేక బస్సులు అధికారులు సిబ్బందికి ఏర్పాటు చేయాలని చెప్పారు. యాదాద్రి పవర్ ప్లాంట్ నుంచి బూడిద తరలింపునకు తాళ్ల వీరప్పగూడెం, దామరచర్లకు నాలుగు వరుసల బైపాస్ రోడ్డు నిర్మాణం ప్రగతిపై వారంలోగా తనకు నివేదిక సమర్పించాలన్నారు. త్వరలో ప్లాంట్‌ను సందర్శించి.. అధికారులు, సిబ్బందితో భేటీ అవుతానని తెలిపారు. సమావేశంలో ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి రోనాల్డ్ రాస్, జెన్‌కో డైరెక్టర్లు అజయ్, సచ్చిదానందం, వైటీపీఎస్‌ చీఫ్‌ ఇంజినీర్‌ సమ్మయ్య, ట్రాన్స్‌కో జేఎండీ శ్రీనివాస్‌, డిప్యూటీ స్పెషల్‌ సెక్రెటరీ కృష్ణ భాస్కర్‌, ఎస్పీడీసీఎల్ సీఎండి ముషారఫ్, ఎన్పీడీసీఎల్ సీఎండి వరుణ్ రెడ్డి పాల్గొన్నారు.

Post a Comment

أحدث أقدم