తెలంగాణలో విద్యుత్‌ ఒప్పందాలపై ఏర్పాటు చేసిన విచారణ కమిషన్‌కు కొత్త ఛైర్మన్‌ను సోమవారం లోపు నియమిస్తామని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. జస్టిస్‌ నరసింహారెడ్డి కమిషన్‌ అంశంలో భారాస అధినేత కేసీఆర్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కమిషన్‌ పంపిన సమన్లపై హైకోర్టు ఈ నెల 1న ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ నర్సింహారెడ్డి ప్రెస్‌మీట్‌ నిర్వహించడంపై సుప్రీంకోర్టు అభ్యంతరం తెలిపింది. కమిషన్‌ ఛైర్మన్‌ను మార్చాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఛైర్మన్‌ను మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. భోజన విరామం తర్వాత తదుపరి విచారణ కొనసాగిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. అయితే భోజన విరామ సమయంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. విద్యుత్ ఒప్పందాలపై విచారణ నుంచి తప్పుకొంటున్నట్లు న్యాయవాది ద్వారా జస్టిస్‌ నర్సింహారెడ్డి సుప్రీంకోర్టుకు లేఖ పంపారు. దీంతో ఆయనస్థానంలో మరొకరి నియామకానికి అత్యున్నత న్యాయస్థానం సమయమిచ్చింది. ఇప్పటికే ఇచ్చిన నోటిఫికేషన్‌ ప్రకారమే కొత్త జడ్జి నేతృత్వంలో కమిషన్‌ విచారణ కొనసాగించవచ్చని పేర్కొంది. సోమవారంలోపు నూతన ఛైర్మన్‌ను నియమిస్తామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. దీంతో కేసీఆర్‌ పిటిషన్‌పై విచారణ ముగిస్తున్నట్టు సీజేఐ ధర్మాసనం వెల్లడించింది. ఇరుపక్షాల తరఫున సీనియర్‌ న్యాయవాదులు సుదీర్ఘంగా వాదనలు వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అభిషేక్‌ మనుసింఘ్వీ, సిద్ధార్థ్‌ లూథ్రా.. కేసీఆర్‌ తరఫున ముకుల్‌ రోహత్గీ  వాదించారు.

Post a Comment

أحدث أقدم