జింబాబ్వేతో జరిగిన ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా జరిగిన చివరి మ్యాచ్‌లోనూ భారత్ ఘన విజయం సాధించింది. 42 పరుగుల భారీ తేడాతో ప్రత్యర్థిని చిత్తు చేసి 4-1 తేడాతో సిరీస్‌ను ముగించింది. ఇప్పటికే సిరీస్ టీమ్ ఇండియా వశంకాగా.. నామమాత్రపు ఐదో మ్యాచ్‌లోనూ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. తొలుత 168 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన భారత్.. ప్రత్యర్థిని 18.3 ఓవర్లలో 125 పరుగులకు ఆలౌట్ చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన జింబాబ్వేకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ముఖేశ్ కుమార్ వేసిన తొలి ఓవర్ మూడో బంతికే ఓపెనర్ వెస్లీ (0) బౌల్డయ్యాడు. తొలిడౌన్‌లో వచ్చిన బ్రియాన్ (10)తో కలిసి మరో ఓపెనర్ మరుమని (27) ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేశాడు. అయితే, వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో మరుమని ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్‌కు చేరాడు. అక్కడికి స్వల్ప వ్యవధిలోనే ముకేశ్ కుమార్ బౌలింగ్‌లో శివం దుబేకు క్యాచ్ ఇచ్చి బ్రియాన్ వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన వారంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. చివర్లో అక్రమ్ (27) కాస్త ఫర్వేలేదనిపించాడు. భారత్ బౌలర్లలో ముఖేశ్ కుమార్ 4 వికెట్లు పడగొట్టగా, శివం దుబే 2, తుషార్, వాషింగ్టన్ సుందర్, అభిషేక్ శర్మ తలో వికెట్ తీశారు. తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియాకు ప్రారంభంలో కఠిన పరిస్థితులు ఎదురైనప్పటికీ.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. సంజు శాంసన్ (58; 45 బంతుల్లో 1×4, 4×6) అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. తొలి ఓవర్లోనే ఓపెనర్ యశస్వి జైశ్వాల్ (12; 5 బంతుల్లో 2×6) రజా బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. తొలి డౌన్‌లో వచ్చిన అభిషేక్ శర్మ (14; 11 బంతుల్లో 1×4,1×6) పెద్దగా రాణించలేకపోయాడు. ముజరబాణి బౌలింగ్‌లో క్లైవ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మరో ఓపెనర్ గిల్ (13; 14 బంతుల్లో 2×4), రెండో డౌన్‌లో వచ్చిన శాంసన్‌తో కలిసి ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేశాడు. కానీ, ఈ జోడీని రిచర్డ్ విడగొట్టాడు. జట్టు స్కోరు 40 పరుగుల వద్ద రజాక్‌కు క్యాచ్ ఇచ్చి.. గిల్ పెవిలియన్‌కు చేరాడు. ఐదు ఓవర్లలోపే కీలకమైన మూడు వికెట్లు కోల్పోవడంతో భారత్ జోరు తగ్గింది. రియాన్ పరాగ్ (22)తో కలిసి శాంసన్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. క్రీజులో నిలదొక్కుకుంటూ.. వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ.. బౌలర్లపై కాస్త ఒత్తిడి పెంచాడు. అయితే, 30 పరుగుల వ్యవధిలోనే వీరిద్దరూ ఔటయ్యారు. అప్పటికి జట్టు స్కోరు 135. చివర్లో శివం దుబే (26), రింకూ సింగ్ (11) కాస్త దూకుడుగా ఆడటంతో భారత్ మంచి స్కోరే చేసింది. జింబాబ్వే బౌలర్లలో ముజరబాణి 2 వికెట్లు పడగొట్టగా, సికిందర్, రిచర్డ్, బ్రాండన్ తలో వికెట్ తీశారు.
إرسال تعليق