స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఏకైక టెస్టులో భారత మహిళల జట్టు రికార్డు స్కోరు చేసింది. 90 ఏండ్ల మహిళల క్రికెట్‌ చరిత్రలో అత్యధిక స్కోరు (603) నమోదు చేసిన జట్టుగా రికార్డులకెక్కింది. తొలి రోజే రికార్డుల దుమ్ముదులిపిన మన అమ్మాయిలు రెండో రోజూ అదే జోరు కొనసాగించి 115.1 ఓవర్లలో 603/6 వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేశారు. రీచా ఘోష్‌ (90 బంతుల్లో 86, 16 ఫోర్లు) శతకం మిస్‌ చేసుకోగా కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (115 బంతుల్లో 69, 4 ఫోర్లు) రాణించడంతో టీమ్‌ఇండియా భారీ స్కోరు సాధించింది. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ఆరంభించిన సఫారీలు బంతితో విఫలమైనా బ్యాట్‌తో దీటుగా బదులిస్తున్నారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 72 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 236 పరుగులు చేసింది. సునె లూస్‌ (164 బంతుల్లో 65, 6 ఫోర్లు, 1 సిక్స్‌), మరిజనె కాప్‌ (125 బంతుల్లో 69 నాటౌట్‌, 8 ఫోర్లు) అర్ధ శతకాలతో కదం తొక్కారు. ఓవర్‌ నైట్‌ స్కోరు 525/4 వద్ద రెండో రోజు ఆరంభించిన భారత్‌ మొదటి రోజు దూకుడునే కొనసాగించింది. ఆట మొదలైన కొద్దిసేపటికే కౌర్‌ టెస్టులలో తన తొలి అర్ధ శతకాన్ని పూర్తిచేసింది. డీక్లర్క్‌ 104వ ఓవర్లో బౌండరీతో రిచా సైతం 54 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ సాధించింది. డెర్క్‌సెన్‌ వేసిన 109వ ఓవర్లో రిచా బౌండరీ బాదడంతో ఆస్ట్రేలియా పేరిట ఉన్న అత్యధిక స్కోరు రికార్డును భారత్‌ అధిగమించింది.

Post a Comment

أحدث أقدم