ఉత్తరప్రదేశ్ లోని ఖుషీనగర్‌లో సోమవారంనాడు జరిగిన ఎన్నికల ర్యాలీలో కేంద్ర హోం మంత్రి, బీజేపీ స్టార్ క్యాంపెయినర్ అమిత్‌షా మాట్లాడుతూ, ఎన్నికల ఓటమికి ఆ ఇద్దరి కవలలను బాధ్యులను చేయరని, వారిపై ఎలాంటి నింద రాకుండా ఖర్గేనే బాధ్యుడిని చేసి ఆయనను ఉద్యోగం నుంచి తొలగిస్తారని, ఈ విషయాన్ని ఖర్గే గ్రహించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. రాహుల్ గాంధీ మనుషులు ఎన్నికల అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈవీఎంల వల్లే తాము ఎన్నికల్లో ఓడిపోయామని కూడా అంటారని అమిత్‌షా చెప్పారు. ఐదు విడతల పోలింగ్‌పై వివరాల తన వద్ద వద్ద ఉన్నాయని, ఆ ప్రకారం ఐదు విడతలు పూర్తయ్యేసరికి ప్రధాని మోదీ 310కి పైగా సీట్లు సొంతం చేసుకున్నారని చెప్పారు. రాహుల్ 40 దాటరని, అఖిలేష్ యాదవ్‌కు 4 సీట్లు కూడా రావని అన్నారు. ఈ ఎన్నికల్లో వెనుకబడిన వర్గాల్లో పుట్టి, దేశాన్ని ముందుకు తీసుకువెళ్తున్న మోదీ ఒకవైపు, వెండి స్పూన్‌తో పుట్టి, పూర్వాంచల్ సమస్యలు ఏమాత్రం తెలియని ఇద్దరు యువరాజులు (రాహుల్, అఖిలేష్) మరోవైపు ఉన్నారని అన్నారు. బీఎస్‌పీ చీఫ్ మాయావతి, అఖిలేష్ యాదవ్ హయాంలో అనేక చక్కెర మిల్లులు మూతపడ్డాయని, యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం 20 చక్కెర మిల్లులను తిరిగి తెరిచిందని చెప్పారు. విపక్షాలు దళిత, వెనుకబడిన, గిరిజన వర్గాల రిజర్వేషన్లను లాక్కుని ముస్లింలకు ఇవ్వాలని అనుకుంటున్నాయని, వారి ఆటలను బీజేపీ ఎంతమాత్రం సాగనీయదని అన్నారు. మొత్తం ఏడు విడతల లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా 7వ విడత పోలింగ్ జూన్ 1న జరుగనుంది. ఇందులో భాగంగా యూపీలోని ఖుషీనగర్ సహా 12 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్ ఉంటుంది.
إرسال تعليق