వాల్‌స్ట్రీట్ జర్నల్‌పై ట్రంప్ వేసిన పరువు నష్టం దావాను కొట్టివేసిన యూఎస్ కోర్టు

జెఫ్రీ ఎప్ స్టీన్‌కు పుట్టినరోజు లేఖ రాశారంటూ వచ్చిన కథనంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాల్‌స్ట్రీట్ జర్నల్‌పై వేసిన పరువు నష్టం దావాను యూఎస్ కోర్టు కొట్టివేసింది. ఎప్ స్టీన్‌తో తనకున్న సంబంధాలను కప్పిపుచ్చుకునేందుకు ట్రంప్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఎప్ స్టీన్‌కు ట్రంప్ అశ్లీల లేఖ రాశారంటూ వాల్‌స్ట్రీట్ జర్నల్ ప్రముఖంగా కథనాన్ని ప్రచురించింది. దీనిని కల్పితమని ఖండిస్తూ ట్రంప్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ట్రంప్‌కు తన పిటిషన్‌ను సవరించుకునే అవకాశం లభించినప్పటికీ, దానిని ఆయన సవరించలేదు. దీంతో తాజాగా విచారణ జరిపిన న్యాయమూర్తి డారిన్ పి. గేల్స్.. ఈ పిటిషన్‌ను పూర్తిగా తోసిపుచ్చడమే కాకుండా, భవిష్యత్తులో తిరిగి దాఖలు చేయడానికి లేదా సవరించడానికి వీలులేకుండా తుది ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసుకు సంబంధించి వాల్‌స్ట్రీట్ జర్నల్ పాటించిన జర్నలిజం ప్రమాణాలతో కోర్టు ఏకీభవించింది. కథనం ప్రచురించే ముందే ట్రంప్ స్పందన కోరడం, ఆయన చేసిన ఖండన ప్రకటనలను కూడా పత్రిక ప్రచురించడాన్ని న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంది. ప్రముఖులు పరువు నష్టం దావాలు వేసేటప్పుడు నిరూపించాల్సిన ‘వాస్తవ దురుద్దేశాన్ని’ ట్రంప్ తరఫు న్యాయవాదులు నిరూపించలేకపోయారని కోర్టు స్పష్టం చేసింది. ప్రతివాది దురుద్దేశంతో పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేశారని విశ్వసనీయంగా ఆరోపించడంలో విఫలమైనందునే ఫిర్యాదును కొట్టివేస్తున్నట్లు న్యాయమూర్తి వెల్లడించారు.

إرسال تعليق

أحدث أقدم
3