మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని దేవాస్ రోడ్డులోని శ్రీ గంగా హోటల్ లోని ఆహార వ్యర్థాల గదిని శుభ్రం చేస్తుండగా విషవాయువు ప్రభావంతో నలుగురు కార్మికులు మృతి చెందారు. మరో ఇద్దరు వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తూ అస్వస్థతకు గురయ్యారు. హోటల్లో ఆహార పదార్థాల వ్యర్థాలను సేకరించే భూగర్భ గదిని శుభ్రం చేసేందుకు కార్మికులు వెళ్లారు. ఈ క్రమంలో ఇద్దరు కార్మికులు లోపలికి వెళ్లి స్పృహ కోల్పోయినట్లు ప్రాథమిక సమాచారం. వారిని కాపాడేందుకు మరో ఇద్దరు కూడా గదిలోకి వెళ్లడంతో నలుగురూ విషవాయువు ప్రభావానికి గురయ్యారు. ఊపిరాడక ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. వారిని బయటకు తీసేందుకు ప్రయత్నించిన మరో ఇద్దరు కూడా విషవాయువు పీల్చి అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు, జిల్లా అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గది తలుపు తెరవడం సాధ్యం కాకపోవడంతో కట్టింగ్ యంత్రాన్ని ఉపయోగించి దాన్ని తెరిచారు. సుమారు గంటన్నర పాటు శ్రమించి నలుగురు కార్మికులను బయటకు తీసుకొచ్చారు. పోలీసులు సీపీఆర్ చేసినప్పటికీ వారిని కాపాడలేకపోయారు. ఆసుపత్రికి తరలించగా వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ప్రమాదానికి గల కారణాలు, కార్మికులు గదిలోకి వెళ్లే ముందు తగిన భద్రతా ఏర్పాట్లు చేశారా అనే అంశాలపై పోలీసులు విచారణ చేపట్టారు. హోటల్ యాజమాన్యం నిర్లక్ష్యం ఏమైనా ఉందా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక, ఇతర ఆధారాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్నారు. మరోవైపు, మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.4 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించాలని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఆదేశించారు. ఈ ఘటనపై ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
హోటల్లో ఆహార వ్యర్థాల గదిని శుభ్రం చేస్తుండగా విషవాయువు లీక్ : నలుగురు కార్మికులు దుర్మరణం
byTelugu Lo Computer
•
•
2 min read
