రాప్తాడు విద్యార్థినికి రెండు కీలక సర్జరీలు విజయవంతం : సోషల్ మీడియా వేదికగా అప్‌డేట్ ఇచ్చిన మంత్రి నారా లోకేశ్

ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా రాప్తాడులో దారుణ దాడికి గురై తీవ్రంగా గాయపడిన విద్యార్థినికి బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో వైద్యులు నిర్వహించిన రెండు కీలక శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేసినట్లు మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. ప్రస్తుతం ఆమెను పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ కు తరలించి వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిపై ఆదివారం నారా లోకేశ్ సోషల్ మీడియా వేదికగా అప్‌డేట్ ఇచ్చారు. బాలికకు నిర్వహించిన ఆర్థోపెడిక్, ప్లాస్టిక్ సర్జరీలు విజయవంతమైనట్లు వైద్యులు ధృవీకరించారని పేర్కొన్నారు. ప్రస్తుతం పీఐసీయూలో చికిత్స కొనసాగుతోందని, వైద్య బృందం ఆమె ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని వివరించారు.బాలిక ప్రాణాలు కాపాడేందుకు శ్రమిస్తున్న వైద్యులు, ఆసుపత్రి సిబ్బందికి లోకేశ్ కృతజ్ఞతలు తెలిపారు. ఆమె కోలుకునే వరకు ప్రభుత్వం కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. విద్యార్థినికి అత్యుత్తమ వైద్య సంరక్షణ అందించడంతో పాటు, అవసరమైన అన్ని రకాల సహాయాన్ని ప్రభుత్వం అందిస్తుందని నారా లోకేశ్ స్పష్టం చేశారు. బాలిక పూర్తిగా కోలుకునే వరకు కుటుంబానికి అండగా నిలుస్తామని తెలిపారు. తాను స్వయంగా బెంగళూరులోని ఆసుపత్రికి వెళ్లి బాలిక ఆరోగ్య పరిస్థితిని సమీక్షించనున్నట్లు మంత్రి వెల్లడించారు. అక్కడి వైద్యులతో మాట్లాడి తదుపరి చికిత్సకు సంబంధించిన వివరాలను తెలుసుకుంటానని చెప్పారు. ఈ ఘటనను ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిగణిస్తోందని, విద్యార్థినికి మెరుగైన భవిష్యత్తు కల్పించేందుకు కట్టుబడి ఉందని నారా లోకేశ్ పేర్కొన్నారు.

إرسال تعليق

أحدث أقدم
3