వివిధ కేటగిరీల నిరుద్యోగులు పోటీ పరీక్షలకు వయోపరిమితి పెంచుతూ తమిళనాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

తమిళనాడు రాష్ట్రంలోని వివిధ కేటగిరీల నిరుద్యోగులకు పోటీ పరీక్షలకు వయో పరిమితి పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో పోటీ పరీక్షలకు హాజరవుతున్న నిరుద్యోగుల నుంచి వస్తున్న డిమాండ్ల మేరకు వయో పరిమితిని ఐదేళ్ల పాటు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది ఇప్పటికే బీసీ, ముస్లిం బీసీ, ఎంబీసీ, డీఎన్సీ, ఎస్సీ, ఎస్టీ, వితంతు కేటగిరీల వారికి ఇచ్చిన మినహాయింపుకు అదనమని ప్రభుత్వం తెలిపింది. గ్రూప్ 1 పోస్టులకు జనరల్ కేటగిరీ అభ్యర్ధులకు 32 ఏళ్ల నుంచి 37 ఏళ్లకు వయో పరిమితి పెంచారు. ఇతర రిజర్వుడు కేటగిరీలకు 37 ఏళ్ల నుంచి 42 ఏళ్ళకు వయోపరిమితి పెంచారు. జనరల్ కేటగిరీలో దివ్యాంగులకు 42 ఏళ్ల నుంచి 47 ఏళ్లు, ఇతర కేటగిరీల్లో దివ్యాంగులకు 47 ఏళ్ల నుంచి 52 ఏళ్లకు వయో పరిమితి పెరిగింది. గ్రూప్ 2, గ్రూప్ 2ఏ పోస్టులకు జనరల్ కేటగిరీకి 30 నుంచి 35 ఏళ్లు, ఇతర కేటగిరీలకు 40 నుంచి 45 ఏళ్లకు వయోపరిమితి పెంచారు. ఇతర కేటగిరీలకు, అలాగే గ్రూప్ 4 పోస్టులకు పోటీపడే వితంతువులకు వయో పరిమితి పూర్తిగా ఎత్తేశారు. అలాగే గరిష్ట విద్యార్హతలు లేని రిజర్వుడు కేటగిరీల అభ్యర్ధులకు 32 ఏళ్ల నుంచి 37 ఏళ్లకు వయో పరిమితి పెంచారు. ఇందులో గ్రూప్ 4 పోస్టులకు మాత్రం ఎస్సీ, ఎస్టీలకు, వితంతువులకు మాత్రం 35 ఏళ్ల నుంచి 40 ఏళ్లకు పెంచారు. అలాగే గరిష్ట విద్యార్హతలు లేని దివ్యాంగులకు రిజర్వుడు కేటగిరీల్లో 42 ఏళ్ల నుంచి 47 ఏళ్లకు పెంచారు. ఎస్సీ, ఎస్టీలు, వితంతువుల్లో దివ్యాంగులకు 45 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఉత్తర్వులు తక్షణం అమల్లోకి వస్తాయని ప్రభుత్వం తెలిపింది. ఇవాళ్టి నుంచి ఐదేళ్ల పాటు ఇవి అమల్లో ఉంటాయని ఉత్తర్వుల్లో పేర్కొంది. 

إرسال تعليق

أحدث أقدم
3