జెన్‌ జీ, కంటెంట్ క్రియేటర్ల లక్ష్యంగా తిరిగి మార్కెట్లోకి ప్రవేశించనున్న కార్బన్ సంస్థ

గత కొంతకాలంగా స్మార్ట్‌ఫోన్ దేశీయ మార్కెట్‌కు దూరంగా ఉన్న కార్బన్ సంస్థ తిరిగి మార్కెట్లోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించింది. జెన్‌ జీ, కంటెంట్ క్రియేటర్లను లక్ష్యంగా చేసుకుని అందుబాటు ధరల్లో కొత్త స్మార్ట్‌ఫోన్లను తీసుకురావాలని నిర్ణయించింది. పెరుగుతున్న ఫోన్ ధరలతో ఇబ్బందులు పడుతున్న వినియోగదారులకు సరసమైన ధరల్లో పరికరాలను అందించడమే తమ లక్ష్యమని సంస్థ వెల్లడించింది. కార్బన్ మాతృ సంస్థ జైనా గ్రూప్ సీఈఓ ప్రదీప్ జైన్ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేస్తూ గత కొన్నేళ్లుగా భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఫోన్ల ధరలు పెరుగుతున్నాయని, అదే సమయంలో కొత్త ఫోన్లు కొనుగోలు చేసే వారి సంఖ్యలో పెద్దగా వృద్ధి కనిపించడం లేదని ఆయన పేర్కొన్నారు. దీనివల్ల ముఖ్యంగా బడ్జెట్ వినియోగదారులు తమకు అవసరమైన ఫోన్లను కొనుగోలు చేయలేకపోతున్నారని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో యువతకు అందుబాటులో ఉండే ధరల్లో స్మార్ట్‌ఫోన్లను తీసుకురావడంపై దృష్టి సారించినట్లు తెలిపారు. ఇటీవల ఒప్పో, వన్‌ప్లస్, వివో, షావోమీ, నథింగ్ వంటి పలు బ్రాండ్లు తమ స్మార్ట్‌ఫోన్ల ధరలను పెంచాయి. మెమరీ చిప్‌ల ధరలు పెరగడం కూడా ఫోన్ల ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా మారింది. ఈ పరిస్థితుల్లో కార్బన్ ఎలాంటి ధరల వ్యూహంతో మార్కెట్లోకి వస్తుందనేది ఆసక్తికరంగా మారింది. కార్బన్ తన తదుపరి స్మార్ట్‌ఫోన్ విడుదలకు సంబంధించి ఇప్పటివరకు అధికారిక తేదీని ప్రకటించలేదు. ఫోన్ ఫీచర్లు, డిజైన్, ధర వంటి వివరాలపైనా స్పష్టత ఇవ్వలేదు. అయితే, అమెజాన్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మైక్రోసైట్ ద్వారా Karbonn Rebel 5G పేరుతో ఓ కొత్త ఫోన్‌ను టీజ్ చేసింది. దీంతో ఈ మోడల్ త్వరలో భారత మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఫోన్ విడుదల తేదీ, ధర, పూర్తి స్పెసిఫికేషన్లను కంపెనీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఈ ఏడాది ఆగస్టులో Karbonn ZenZ Pro 4G పేరుతో మరో ఫోన్ గీక్‌బెంచ్‌ ప్లాట్‌ఫామ్‌పై కనిపించినట్లు వార్తలు వచ్చాయి. ఇందులో మీడియాటెక్ చిప్‌సెట్ ఉండొచ్చని సమాచారం వెలువడింది. అయితే, ఈ ఫోన్‌పై కంపెనీ నుంచి అధికారిక ధ్రువీకరణ రావాల్సి ఉంది. కార్బన్ మొబైల్స్‌ను ఢిల్లీకి చెందిన జైనా గ్రూప్, బెంగళూరుకు చెందిన యూటీఎల్ గ్రూప్ సంయుక్తంగా ఏర్పాటు చేశాయి. 2011లో Karbonn A1 పేరుతో తొలి ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఒకప్పుడు దేశీయ మొబైల్ మార్కెట్లో ప్రముఖ బ్రాండ్లలో ఒకటిగా గుర్తింపు పొందిన ఈ సంస్థ.. ఆ తర్వాత కొన్నేళ్లుగా స్మార్ట్‌ఫోన్ విభాగంలో పెద్దగా కనిపించలేదు. ఇప్పుడు మారుతున్న మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా కొత్త ఫోన్లతో తిరిగి తన ఉనికిని చాటుకోవాలని ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా తక్కువ ధరల్లో 5జీ స్మార్ట్‌ఫోన్లకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో.. కార్బన్ ఎలాంటి ఫీచర్లతో వినియోగదారుల ముందుకు వస్తుందనేది చూడాలి.

إرسال تعليق

أحدث أقدم
3