విడాకులు ఇవ్వడానికి నిరాకరించిందన్న కక్షతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త

బీహార్‌లోని సుపాల్ జిల్లాలో విడాకులు ఇవ్వడానికి నిరాకరించిందన్న కక్షతో భార్యను కడతేర్చిన కిరాతక ఘటన వెలుగులోకి వచ్చింది. భర్త చేసిన అఘాయిత్యంతో 21 ఏళ్ల యువతి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో ప్రాణాలు కోల్పోయింది. పోలీసుల వివరాల ప్రకారం సుపాల్ జిల్లాకు చెందిన సంజీవ్ సాహ్, దామిని కుమారి (21) ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమయ్యారు. సుమారు రెండేళ్ల పాటు ప్రేమించుకున్న వీరు, పెద్దలను కాదని తొమ్మిది నెలల క్రితం వివాహం చేసుకున్నారు. పెళ్లయిన తర్వాత దామిని కేవలం ఒక్కసారి మాత్రమే తన అత్తగారింటికి వెళ్లి మరుసటి రోజు తిరిగి పుట్టింటికి వచ్చేసింది. అయితే కొద్దికాలానికే వీరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. భార్యతో కలిసి ఉండలేనని భావించిన సంజీవ్ సాహ్ ముజాఫర్‌పూర్‌లో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నాడు. కానీ దామిని మాత్రం విడాకులు ఇచ్చేందుకు ససేమిరా ఒప్పుకోలేదు. భార్య తన దారికి రాకపోవడంతో ఆమెను అడ్డు తొలగించుకోవాలని సంజీవ్ పక్కాగా పథకం పన్నాడు. పథకం ప్రకారం ఆదివారం రాత్రి సంజీవ్ తన భార్య దామినిని బైక్‌పై తూర్పు కోసి కట్టడ ప్రాంతానికి తీసుకెళ్లాడు. మార్గమధ్యలో సరిహద్దు రోడ్డులోని ఓ దుకాణంలో పెట్రోల్ బాటిల్ కొనుగోలు చేసి దానిని దామిని ప్లాస్టిక్ సంచిలో పెట్టాడు. అలా కోసి కట్టడ వెంట దాదాపు 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న బైసి రోడ్డుకు తీసుకెళ్లాడు. రాత్రి 10 గంటల ప్రాంతంలో లాల్‌మన్‌పట్టి వద్ద ఉన్న కాలువ సమీపంలో బైక్ ఆపి దామినిపై పెట్రోల్ పోసి నిప్పంటించి అక్కడి నుంచి పరారయ్యాడు. మంటలతో రోడ్డుపై పరుగులు పెడుతున్న దామినిని గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించడంతో పాటు ఆంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. అయితే తీవ్ర గాయాలపాలైన దామిని చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా నిందితుడు సంజీవ్ సాహ్ తన నేరాన్ని అంగీకరించాడు. ఈ ఘటనపై మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుడు సంజీవ్‌ను అరెస్ట్ చేశారు.


إرسال تعليق

أحدث أقدم
3