250 మంది ఉద్యోగులను తొలగించిన అమెజాన్

అమెజాన్ ప్రముఖ ఉత్పత్తులైన కిండిల్ ఈ-రీడర్స్, ఎకో స్మార్ట్ స్పీకర్లను రూపొందించే సంస్థ డివైసెస్ విభాగంలో సుమారు 250 మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించింది. గ్లోబల్‌గా కార్యకలాపాలు సాగిస్తున్న ఈ విభాగంలో అమెరికా కేంద్రంగా ముఖ్య నాయకత్వం పనిచేస్తోంది. అయితే, ఈ లేఆఫ్స్ ప్రభావం ఏయే దేశాల ఉద్యోగులపై పడిందనే వివరాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. రాయిటర్స్ కథనం ప్రకారం, బాధితులకు తెల్లవారుజామునే ఈ-మెయిల్స్, టెక్స్ట్ మెసేజ్‌ల ద్వారా ఉద్వాసన సమాచారాన్ని అమెజాన్ చేరవేసింది. సంస్థ నిర్మాణంలో మార్పులపై సమగ్ర సమీక్ష నిర్వహించిన తర్వాతే ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అమెజాన్ వైస్ ప్రెసిడెంట్ చెరీ రాబిన్సన్ పంపిన అంతర్గత ఈ-మెయిల్‌లో పేర్కొన్నారు. ఈ లేఆఫ్స్‌ను ధ్రువీకరించిన అమెజాన్ ప్రతినిధి, సంస్థను మరింత సమర్థవంతంగా నడపడానికి, భవిష్యత్ ప్రొడక్ట్ రోడ్‌మ్యాప్‌కు అనుగుణంగా వనరులను కేటాయించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. డెవలపర్లు కృత్రిమ మేధ సాంకేతికతను ఒడిసిపట్టుకోవాలని, లేకుంటే వెనుకబడిపోతామని ఇంజనీరింగ్ నాయకత్వం ఒక మెమో జారీ చేసిన మరుసటి రోజే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. అంతేకాకుండా, ఈ డివైసెస్ యూనిట్ రీడిజైన్ చేసిన 'ఎకో షో 16', 'అలెక్సా ఫోటో ఫ్రేమ్', 'ఎకో టైమ్' సహా ఐదు సరికొత్త అలెక్సా ఆధారిత పరికరాలను మార్కెట్లోకి విడుదల చేసిన రోజే ఉద్యోగుల తొలగింపు వార్త బయటకు వచ్చింది. ఇటీవలే రిటైల్ విభాగంలో 1,000 మంది ఉద్యోగులను తొలగించిన అమెజాన్, ఈ ఏడాది ప్రారంభంలో 16,000 మందిని, అంతకుముందు 14,000 మందిని తొలగించింది. ఒకవైపు లేఆఫ్స్ కొనసాగిస్తూనే, మరోవైపు కేవలం ఈ ఏడాదే ఏఐ విభాగంలో ఏకంగా $220 బిలియన్ల పెట్టుబడులు పెట్టేందుకు ప్రణాళికలు రచిస్తోంది.

إرسال تعليق

أحدث أقدم
3