టాటా గ్రూప్ మాతృసంస్థ టాటా సన్స్ ఛైర్మన్‌గా ఎన్. చంద్రశేఖరన్ వరుసగా మూడోసారి ఐదేళ్ల కాలానికి తిరిగి నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన పదవీకాలం ఫిబ్రవరి 2027తో ముగియాల్సి ఉంది. ఆ తర్వాత మరో టర్మ్‌ను కొనసాగించబోనని ఆయన గతంలోనే బోర్డుకు సంకేతాలు ఇచ్చారు. అయితే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న తాజా నిర్ణయం, దానివల్ల తలెత్తిన అనూహ్య పరిణామాలతో టాటా సన్స్ బోర్డు చంద్రశేఖరన్ నాయకత్వం కొనసాగాలని ఏకగ్రీవంగా నిర్ణయించింది. దేశంలోనే అతిపెద్ద కార్పొరేట్ దిగ్గజమైన టాటా గ్రూప్‌లో చోటుచేసుకున్న ఈ పరిణామం భారత వ్యాపార వర్గాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నాయకత్వ పొడిగింపు వెనుక బలమైన రెగ్యులేటరీ కారణాలు దాగున్నాయి. 2022లో ఆర్బీఐ స్కేల్-బేస్డ్ నిబంధనల ప్రకారం టాటా సన్స్‌ను అప్పర్ లేయర్ ఎన్‌బీఎఫ్‌సీ గా వర్గీకరించింది. ఈ కేటగిరీ కింద ఉన్న సంస్థలు మూడేళ్లలోగా తప్పనిసరిగా స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టిం కావాల్సి ఉంటుంది. అయితే స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ కాకుండా ప్రైవేట్ లిమిటెడ్ హోదాలోనే ఉండేందుకు టాటా సన్స్ వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. అందులో భాగంగానే దాదాపు 21,000 కోట్ల రుణాలను ముందస్తుగానే తీర్చివేసి, తమ ఎన్‌బీఎఫ్‌సీ, కోర్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ రిజిస్ట్రేషన్‌ను స్వచ్ఛందంగా రద్దు చేయాలని కోరుతూ మార్చి 2024లో ఆర్బీఐకి దరఖాస్తు చేసుకుంది. కానీ గతవారం ఆర్బీఐ టాటా సన్స్ దరఖాస్తును తిరస్కరించడంతో గ్రూప్‌నకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. 1 లక్ష కోట్లకు పైగా ఆస్తులున్న సంస్థలు నిబంధనల ప్రకారం అప్పర్ లేయర్‌లోనే కొనసాగాల్సి ఉంటుందని ఆర్బీఐ తేల్చిచెప్పింది. దీంతో టాటా సన్స్ భారత స్టాక్ మార్కెట్లలో లిస్టింగ్ కాక తప్పని అనివార్య పరిస్థితి ఏర్పడింది. టాటా సన్స్‌లో దాదాపు 66 శాతం వాటా ఉన్న టాటా ట్రస్ట్స్ బహిరంగ లిస్టింగ్‌ను వ్యతిరేకిస్తుండగా, 18 శాతం వాటా కలిగిన షాపూర్‌జీ పల్లోంజీ గ్రూప్ మాత్రం విలువను అన్‌లాక్ చేసేందుకు ఐపీఓ రావాలని ఎప్పటినుంచో డిమాండ్ చేస్తోంది. ఈ వివాదం ఒకవైపు, ఐపీఓకు సిద్ధమవ్వాల్సిన చట్టపరమైన బాధ్యత మరోవైపు టాటా సన్స్‌కు సవాలుగా మారాయి. దేశ మార్కెట్ చరిత్రలోనే అతిపెద్ద మెగా ఐపీఓ వచ్చే అవకాశం ఉన్న సమయంలో అనుభవజ్ఞుడైన నాయకత్వ కొనసాగింపు అత్యంత కీలకమని ఇన్వెస్టర్లు, బోర్డు భావించాయి. 2017 నుంచి టాటా గ్రూప్‌ను లాభాల బాట పట్టిస్తూ, డిజిటల్, ఏవియేషన్, సెమీకండక్టర్ రంగాల్లోకి దూసుకెళ్లేలా నడిపిస్తున్న చంద్రశేఖరన్ సారథ్యమే ఈ సంక్లిష్ట దశలో సంస్థకు అవసరమని బోర్డు తేల్చింది. టాటా ట్రస్ట్స్ పరిధిలోని అంతర్గత విభేదాలు, నాయకత్వ మార్పు అనిశ్చితిని నివారించడానికే చంద్రశేఖరన్‌ను మరో ఐదేళ్ల పాటు ఛైర్మన్‌గా కొనసాగించేందుకు బోర్డు అధికారిక ఆమోదముద్ర వేసింది.
إرسال تعليق