గుజరాత్‌లోని కచ్ జిల్లా శివలాఖా నుంచి మిఠాపూర్ మధ్య నడిచే దేశంలోనే మొదటి 'స్టెయిన్‌లెస్ స్టీల్ ఉప్పు కంటెయినర్ రైలు'ను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వర్చువల్‌గా ప్రారంభించారు. సాధారణ వ్యాగన్లలో ఉప్పును రవాణా చేసే సమయంలో తేమను పీల్చుకోవడం, వ్యాగన్లు త్వరగా తుప్పు పట్టడం, సరుకు కంటే వ్యాగన్ బరువే ఎక్కువగా ఉండటం వంటి ప్రధాన సమస్యలను ఈ కొత్త సాంకేతికత పరిష్కరిస్తుంది. ఉప్పులో ఉండే సోడియం క్లోరైడ్, గాలిలోని తేమ కలిసి సాధారణ ఇనుము లేదా ఉక్కు వ్యాగన్లను వేగంగా తుప్పు పట్టేలా చేస్తాయి. అందుకే ఈ కొత్త కంటెయినర్లను అధిక నాణ్యత గల స్టెయిన్‌లెస్ స్టీల్‌తో తయారు చేశారు. సాధారణ వ్యాగన్లు కొన్ని సంవత్సరాల్లోనే పాడైపోగా స్టెయిన్‌లెస్ స్టీల్ నిర్మాణం వల్ల వ్యాగన్ల జీవితకాలం భారీగా పెరుగుతుంది. నిర్వహణ వ్యయం తగ్గిపోతుంది. ఉప్పు బరువుగా ఉండటం వల్ల పాత మోడల్ వ్యాగన్లలో వ్యాగన్ సొంత బరువు కంటే మోసే సరుకు నిష్పత్తి సమర్థవంతంగా ఉండేది కాదు. తేలికైన, బలమైన స్టెయిన్‌లెస్ స్టీల్‌ను ఉపయోగించడం ద్వారా కంటెయినర్ బరువు తగ్గి, ఎక్కువ పరిమాణంలో ఉప్పును లోడ్ చేసే వెసులుబాటు లభించింది. కంటెయినర్ పైభాగం నుంచి నేరుగా ఉప్పును నింపేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అన్‌లోడింగ్ సమయాన్ని గణనీయంగా తగ్గించడానికి కంటెయినర్‌ను పక్కకు వంచే (టిల్ట్‌) సదుపాయం ఉంది. దీనివల్ల మానవ శ్రమ లేకుండా వేగంగా సరుకును ఖాళీ చేయవచ్చు. రవాణా సమయంలో ఉప్పు వాతావరణంలోని తేమను పీల్చుకుని గడ్డకట్టడం లేదా తడిసిపోవడం జరుగుతుంది. ఈ సీల్డ్ కంటెయినర్ల వల్ల వర్షం లేదా గాలిలోని తేమ లోపలికి చేరకుండా ఉప్పు దాని సహజ స్థితిలోనే ఉంటుంది.

Post a Comment

أحدث أقدم