తెలంగాణ శాసనసభాపతి స్థానాన్ని, వారి స్వర్గీయ మాతృమూర్తిని ఉద్దేశించి కొందరు సభ్యులు వాడిన అనుచిత భాషతో పాటు, కృత్రిమ మేధస్సు టెక్నాలజీని ఉపయోగించి సోషల్ మీడియా వేదికగా సాగిస్తున్న దుష్ప్రచారం అత్యంత హేయమైన చర్య అని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ దిగజారుడు చర్యలను భారతీయ జనతా పార్టీ ముక్తకంఠంతో ఖండిస్తోందని సభలో స్పష్టం చేశారు. శాసనసభలో ప్రతి సభ్యుడి హక్కులను కాపాడుతూ, అత్యంత హుందాగా సభా కార్యకలాపాలను నిర్వహిస్తున్న గౌరవ స్పీకర్‌ను ఈ విధంగా అవమానించడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అత్యున్నత ప్రాధాన్యతనిస్తూ, సమాజంలో అట్టడుగున ఉన్న ప్రతి వ్యక్తికీ ప్రభుత్వ ఫలాలు చేరాలని నిరంతరం శ్రమించే ఏకైక పార్టీ బీజేపీ అని ఆయన పేర్కొన్నారు. స్పీకర్ వ్యవస్థ గౌరవాన్ని దిగజార్చి, హేయమైన చర్యలకు పాల్పడిన బాధ్యులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, వారిని సభ నుంచి శాశ్వతంగా బహిష్కరించాలని పాయల్ శంకర్ డిమాండ్ చేశారు. బాధ్యులపై తీసుకునే ఎలాంటి కఠిన చర్యలకైనా తమ పార్టీ పూర్తి మద్దతు ప్రకటిస్తుందని తేల్చిచెప్పారు. మరోవైపు, రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న అత్యంత కీలకమైన సమస్యలపై చర్చ జరపడంలో, పరిష్కారం చూపడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏమాత్రం సరైన రీతిలో స్పందించడం లేదని ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

Post a Comment

أحدث أقدم