తెలంగాణ నుంచి రాయలసీమ, తమిళనాడు మీదుగా కొనసాగుతున్న ద్రోణి, పశ్చిమ మధ్య బంగాళాఖాతం, కోస్తాంధ్రపై విస్తరించిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఉత్తరాంధ్రలో వర్ష ప్రభావం మరింత ఎక్కువగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. దీంతో ఈ ప్రాంతాల ప్రజలు బయటకు వెళ్లే సమయంలో అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. అదే సమయంలో అల్లూరి, పోలవరం, అనకాపల్లి, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తాంధ్రలోని మరికొన్ని ప్రాంతాల్లోనూ ఒక్కసారిగా వాతావరణం మారి వర్షం పడే పరిస్థితులు ఉన్నాయి. గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, నెల్లూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది. ఇక రాయలసీమలో చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో చెదురుమదురు వర్షాలు పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భారీగా వర్షాలు నమోదయ్యాయి. మంగళవారం సాయంత్రం 5 గంటల వరకు తాడేపల్లిగూడెంలో అత్యధికంగా 52.5 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఏలూరు జిల్లా పెరికగూడెంలో 31.3 మి.మీ., పెంటపాడులో 27.6 మి.మీ. వర్షం కురిసింది. చందర్లపాడు, పండ్రపాడులో 24 మి.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. ఆకస్మిక వర్షాల సమయంలో పిడుగులు పడే అవకాశం ఉంది. ప్రజలెవరూ చెట్లు, విద్యుత్ స్తంభాలు, బహిరంగ ప్రదేశాలకు దూరంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
ద్రోణి, ఆవర్తనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో వర్షాలు : వాతావరణ శాఖ అంచనా
Telugu Lo Computer
0
تعليقات
إرسال تعليق