దేశీయ మార్కెట్లోకి చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ బివైడికి చెందిన డెంజా బ్రాండ్‌ను తీసుకొచ్చేందుకు బివైడి ప్రణాళికలు రచిస్తున్నట్లు కథనాలు వస్తున్నాయి. నిజానికి 2010లో బివైడి, ప్రముఖ దిగ్గజ సంస్థ మెర్సిడేస్ బెంజ్ గ్రూప్ కలిసి ఉమ్మడిగా ఈ డెంజా బ్రాండ్‌ను ప్రారంభించాయి. అయితే ఆ తర్వాత ఈ భాగస్వామ్యం నుంచి మెర్సిడేస్ బెంజ్ తప్పుకోవడంతో, బివైడి ఈ బ్రాండ్‌ను పూర్తిగా తన చేతుల్లోకి తీసుకుని, ఒక సూపర్ లగ్జరీ , ప్రామిసింగ్ హై-ఎండ్ బ్రాండ్‌గా రూపుదిద్దింది. బివైడి ఇప్పటికే ఉన్న తన వాహనాల రేంజ్‌ కంటే పైన, అంటే అత్యంత ఖరీదైన ప్రీమియం సెగ్మెంట్‌లో ఈ డెంజా కార్లను నిలబెట్టాలని చూస్తోంది. మనదేశంలో బివైడి రూ. 20 లక్షల నుంచి రూ. 80 లక్షల రేంజ్‌లో కార్లను విక్రయిస్తుండగా, రూ. 80 లక్షలు దాటిన లగ్జరీ సెగ్మెంట్‌ను డెంజా కార్లతో భర్తీ చేయనుంది. ఆటోకార్ ఇండియా సమాచారం ప్రకారం, కంపెనీ ప్రారంభంలో రెండు మోడళ్లను భారతదేశంలోకి తీసుకురానుంది. అందులో ఒకటి ‘జెడ్‌9 జీటీ’ కాగా, మరొకటి ‘డి9 లగ్జరీ ఎంపివి’. ఈ రెండింటినీ పూర్తి స్థాయిలో తయారైన కార్లుగా – కంప్యూట్లీ బిల్ట్ అప్ యూనిట్) నేరుగా దిగుమతి చేసి ఇక్కడ విక్రయించనున్నారు. వీటిలో డెంజా జెడ్‌9 జీటీ విషయానికి వస్తే.. గ్లోబల్ మార్కెట్‌లో ఇది ఎలక్ట్రిక్, ప్లగ్-ఇన్ హైబ్రిడ్ అనే రెండు వెర్షన్‌లలో లభిస్తున్నప్పటికీ, భారత్‌కు మాత్రం కేవలం ఆల్-ఎలక్ట్రిక్ వెర్షన్‌ మాత్రమే రానుంది. దాదాపు 2.9 టన్నుల బరువు ఉండే ఈ పవర్‌ఫుల్ ఈవీలో మూడు ఎలక్ట్రిక్ మోటార్లు ఉంటాయి. ఇవి ఏకంగా 1156 హెచ్‌పి (HP) మైండ్ బ్లోయింగ్ పవర్‌ను ఉత్పత్తి చేస్తాయి. పనితీరు విషయానికి వస్తే, ఈ కారు కేవలం 2.7 సెకన్లలోనే 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. గంటకు 270 కిలోమీటర్ల టాప్ స్పీడ్‌తో దూసుకెళ్లే ఈ కారు, ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే 600 కిలోమీటర్ల క్లెయిమ్డ్ రేంజ్‌ను ఇస్తుంది. ఈ సూపర్ ఈవీ భారతదేశంలో రూ. 1.2 కోట్ల నుంచి రూ. 1.5 కోట్ల భారీ బడ్జెట్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది. మరోవైపు డెంజా డి9 లగ్జరీ ఎంపివి మోడల్ మార్కెట్లో ఉన్న టొయోటా వెల్‌ఫైర్ వంటి అల్ట్రా-లగ్జరీ వాహనాలకు గట్టి పోటీ ఇవ్వనుంది. ఫ్రంట్ వీల్ డ్రైవ్ ఆప్షన్‌తో, ఆల్-ఎలక్ట్రిక్ వెర్షన్‌లో రానున్న ఈ కారు ధర దాదాపు రూ. 80 లక్షల వరకు ఉండొచ్చు. ఇందులో భారీ 103kWh బ్యాటరీ ప్యాక్‌ను అందించారు. ఇది సింగిల్ ఛార్జ్‌పై 520 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుందని కంపెనీ చెబుతోంది. 2 + 2 + 3 సీటింగ్ కాన్ఫిగరేషన్‌తో వచ్చే ఈ రాజసమైన కారులో ప్రయాణికుల కంఫర్ట్ కోసం త్రీ-జోన్ క్లైమేట్ కంట్రోల్, ప్రీమియం ఆడియో సిస్టమ్, ఫుల్ లెదర్ అపోల్స్టరీ వంటి అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. అంతేకాకుండా, మిడిల్ రో (మధ్య వరుస)లో కూర్చునే వారి కోసం ప్రత్యేకంగా ఫోల్డ్-అవుట్ టేబుల్స్, రిలాక్స్ అవ్వడానికి ఎక్స్టెండబుల్ లెగ్ రెస్ట్‌లను కూడా అమర్చారు. సంపన్నులను, లగ్జరీ ఈవీలను కోరుకునే వారిని లక్ష్యంగా చేసుకుని వస్తున్న ఈ డెంజా రాకతో భారత లగ్జరీ కార్ల మార్కెట్ మరింత వేడెక్కడం ఖాయంగా కనిపిస్తోంది.

Post a Comment

أحدث أقدم