Ad Code

హోండా ఫ్లెక్స్ ఫ్యూయల్‌ బైక్‌ లాంచ్ !


హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) భారత మార్కెట్లో మొట్ట మొదటి ఫ్లెక్స్ ఫ్యుయల్ బైక్‌ను లాంచ్‌ చేసింది. 'CB300F ఫ్లెక్స్ ఫ్యూయల్' పేరుతో దీన్ని ఆవిష్కరించింది. 300 సీసీ సెగ్మెంట్‌లో భారత మార్కెట్‌లోకి వస్తున్న తొలి ఫ్లెక్స్ ఫ్యూయల్ బైక్ ఇదే కావడం విశేషం. అయితే, హోండా సంస్థ ఇలాంటి మెడళ్లను తయారు చేయడం ఇది మొదటి సారేమీ కాదు. గతంలో బ్రెజిల్‌ దేశంలో 70 లక్షల ఫ్లెక్స్ ఫ్యుయల్ బైక్‌లను విక్రయించింది. ఈ ఫ్లెక్స్ ఫ్యూయల్ బైక్ 85 శాతం ఇథనాల్, 15 శాతం గ్యాసోలిన్‌తో పనిచేస్తుంది. ఈ బైక్ రూ. 1.70 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) వద్ద అందుబాటులో ఉంది. హోండా ఫ్లెక్స్‌ ఫ్యూయల్ బైక్‌ మొత్తం రెండు కలర్‌ వేరియంట్లలో లభిస్తుంది. స్పోర్ట్స్‌ రెడ్‌, మ్యాట్‌ యాక్సిస్‌ గ్రే మెటాలిక్‌ అనే రెండు కలర్‌ కాంబినేషన్లలో అందుబాటులో ఉంటుంది. దీని బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయని కంపెనీ తెలిపింది. అక్టోబర్‌ చివరి వారం నుంచి హోండా బిగ్‌ వింగ్‌ డీలర్‌షిప్‌ సెంటర్లలో అందుబాటులో ఉంటుందని ప్రకటించింది. హోండా ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌ బైక్‌ను తీసుకురావడంపై కంపెనీ ఎండీ, సీఈవో సుత్సము ఒటాని హర్షం వ్యక్తం చేశారు. ఇది తమ ప్రయాణంలో సరికొత్త మైలురాయిని సూచిస్తుందని తెలిపారు. వాతావరణాన్ని కాపాడటానికి, కర్భన ఉద్ఘారాలను తగ్గించడానికి హోండా ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌ బైక్‌లను అభివృద్ధి చేసినట్లు పేర్కొన్నారు. ఫ్లెక్స్ ఇంధనాన్ని ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల్లో (FFVలు) మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. ఫ్లెక్స్ ఫ్యూయల్‌ ప్రధానంగా పెట్రోల్ (గ్యాసోలిన్), ఇథనాల్ కాంబినేషన్‌తో తయారవుతుంది. ఈ మిశ్రమంలో 15 శాతం పెట్రోల్‌, 85% ఇథనాల్‌ ఉంటుంది. ఇది తక్కువ స్థాయిలో కార్భన్‌ డయాక్సైడ్‌ను విడుదల చేయడంతో పాటు, ఇతర హానికరమైన గ్రీన్‌హౌస్‌ వాయువులను తగ్గిస్తుంది. ఈ ఇంధనం కాలుష్యాన్ని అరికట్టడమే కాకుండా, క్రూడ్‌ ఆయిల్‌ కోసం గల్ఫ్ దేశాలపై భారతదేశం ఆధారపడటాన్ని కూడా తగ్గిస్తుంది. ఇథనాల్‌ను వరి గడ్డి, చెరుకు గడ్డి వంటి వ్యవసాయ వ్యర్థాలతో తయారు చేస్తారు. హోండా ఫ్లెక్స్‌ ఫ్యూయల్ బైక్‌ 293.5 సీసీ సింగిల్-సిలిండర్ ఆయిల్-కూల్డ్ ఇంజన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజిన్‌ 24.5bhp, 25.9Nm శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌కు 6 స్పీడ్ గేర్‌బాక్స్‌ను జోడించారు. ఈ బైక్‌ డ్యుయల్ ఛానెల్ ఏబీఎస్, హోండా సెలెక్టబుల్ టార్క్ కంట్రోల్‌, గోల్డెన్ యూఎస్డీ ఫ్రంట్ ఫోర్క్స్, ఫైవ్ స్టెప్ అడ్జస్టబుల్ రేర్ మోనో షాక్తో పాటు పాటు ముందు భాగంలో 276 ఎంఎం డిస్క్, వెనుక భాగంలో 220 ఎంఎం డిస్క్ బ్రేక్స్ కలిగి ఉంటుంది. వీటి ద్వారా ఎత్తు పల్లాలు ఉన్న రోడ్లపై కూడా సులభంగా రైడింగ్‌ చేయవచ్చు. చీకట్లో మంచి వెలుతురు కోసం దీనిలో ఎల్‌ఈడీ లైట్లను అమర్చింది. ముందు డిస్‌ప్లేలో స్పీడ్ మీటర్‌, ఓడో మీటర్, టాచో మీటర్, ఫ్యూయల్ గేజ్, ట్విన్ ట్రిప్ మీటర్స్, గేర్ పొజిషన్, క్లాక్‌వి రైడర్లు చూసుకునే వెసులుబాటు ఉంటుంది. దీనిలో ఇథనాల్‌ ఇండికేటర్‌ను ప్రత్యేకంగా అమర్చారు. బైకులో ఇథనాలు కంటెంట్‌ 85 శాతం కంటే ఎక్కువగా ఉంటే ఇండికేటర్‌ మెరుస్తుంది. బైక్‌ మైలేజీ 30 కిలో మీటర్ల వరకు వస్తుంది.

Post a Comment

0 Comments

Close Menu