నేపాల్‌లో ప్రముఖ పర్యాటక ప్రాంతమైన షే ఫోక్సుండో సరస్సు సందర్శనకు ట్రెక్కింగ్‌కు వెళ్లిన ఆరుగురు భారతీయులు అదృశ్యమయ్యారు. వీరిలో ఇద్దరు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు. భారీగా మంచు కురుస్తుండటంతో వారి ఆచూకీ కనుగొనడం కష్టంగా మారింది. వారిని గుర్తించేందుకు అధికారులు గాలింపు, చర్యలు చేపట్టారు. అధికారులు అందించిన సమాచారం ప్రకారం.. ఈ పర్యాటకులు డోల్పో బుద్ధ గ్రామీణ మున్సిపాలిటీలోని 4, 8 వార్డుల నుంచి షే ఫోక్సుండో సరస్సు వైపు ప్రయాణమయ్యారు. షే ఫోక్సుండో గ్రామీణ మున్సిపాలిటీలోని 4, 8 వార్డుల మధ్య ఉన్న నుమ్లా పాస్, బగ్లా పాస్ ప్రాంతాల్లో వారు చివరిసారిగా కనిపించినట్లు సమాచారం. అప్పటి నుంచి వారి జాడ తెలియడం లేదు. ఎత్తైన పర్వత ప్రాంతం నుంచి తిరిగి వస్తున్న సమయంలో మంచులో చిక్కుకుపోయి ఉండవచ్చని స్థానిక గైడ్లు అనుమానిస్తున్నారు. ప్రతికూల వాతావరణం, పర్వత ప్రాంతాల్లో కఠిన పరిస్థితుల గురించి స్థానికులు ముందుగానే హెచ్చరించినప్పటికీ పర్యాటకులు తమ ప్రయాణాన్ని కొనసాగించినట్లు తెలుస్తోంది. వారిని గుర్తించేందుకు సహాయక బృందాలు ప్రయత్నిస్తున్నాయి. అయితే ప్రతికూల వాతావరణ పరిస్థితులు, మొబైల్ నెట్వర్క్ అందుబాటులో లేకపోవడంతో గాలింపు చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. ఆరుగురు భారతీయుల ఆచూకీ కోసం అధికారులు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.
