పాకిస్తాన్లో ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఉద్యోగంలో ఉండగానే విదేశాల్లో శాశ్వత నివాసాలను ఏర్పాటు చేసుకుంటున్నారని ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఆందోళన వ్యక్తం చేశారు. కెనడా, అమెరికా, బ్రిటన్‌తో పాటు పలు యూరప్ దేశాలకు పాకిస్తాన్ అధికారులు వలస వెళ్లిపోతున్నారన్నారు. ఈ పరిణామం దేశం పట్ల, తమ విధుల పట్ల అధికారులకు ఉన్న నిబద్ధతపై ప్రశ్నలు లేవనెత్తుతోందని వ్యాఖ్యానించారు. గత కొన్నేళ్లుగా పలువురు అధికారులు విదేశాల్లో శాశ్వత నివాసం కోసం ప్లాన్ చేసుకుంటున్నారని ఆయన ఎక్స్ వేదికగా అన్నారు. ఉద్యోగంలో ఉన్నప్పుడే ఈ ఏర్పాట్లు చేసుకుంటున్నారని ఆరోపించారు. పాకిస్తాన్ బ్యూరోక్రాట్లకు పోర్చుగల్ ఇటీవలి కాలంలో ముఖ్యమైన గమ్యస్థానంగా మారిందని అన్నారు. విదేశాల్లో శాశ్వత నివాసాలు ఏర్పాటు చేసేందుకు అధికారులకు సహాయం చేసే వ్యక్తి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి పారిపోయినట్లు ఆసిఫ్ ఆరోపించారు. అయితే, ఆ వ్యక్తి వివరాలు, దానికి సంబంధించిన ఆధారాలు ఆయన బహిరంగంగా వెల్లడించలేదు.
ఉద్యోగంలో ఉండగానే ప్రభుత్వ ఉన్నతాధికారులు విదేశాల్లో శాశ్వత నివాసాలను ఏర్పాటు : ఎక్స్ వేదికగా పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఆందోళన
byTelugu Lo Computer
•
•
2 min read
