గత మూడు దశాబ్దాలుగా కోర్టు వివాదాల్లో నలిగిపోయిన అత్యంత విలువైన "వైల్డ్ఫ్లవర్ హాల్ హోటల్"పై రాష్ట్ర ప్రభుత్వం పట్టు సాధించింది. ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు నేతృత్వంలోని ప్రభుత్వం న్యాయస్థానాల్లో గట్టిగా పోరాడి విజయం సాధించడమే కాకుండా, ఇప్పుడు ఆ హోటల్ నిర్వహణ హక్కులను ఈ-వేలం ద్వారా దక్కించుకుని చరిత్ర సృష్టించింది. ఈ విజయం ప్రభుత్వ ఖజానాకు వేల కోట్ల రూపాయల ప్రయోజనాన్ని తెచ్చిపెట్టబోతోంది. వైల్డ్ఫ్లవర్ హాల్ హోటల్ ఆపరేషన్, మేనేజ్మెంట్ లైసెన్స్ హక్కుల కోసం ప్రభుత్వం తాజాగా నిర్వహించిన ఈ-వేలానికి ఊహించని స్పందన లభించింది. హోటల్ వార్షిక స్థూల ఆదాయంలో ఏకంగా 47.1 శాతాన్ని ప్రభుత్వానికి వాటాగా ఇచ్చేందుకు బిడ్డర్లు ముందుకు వచ్చారు. ఇప్పటివరకు జరిగిన హోటల్ వేలాల్లో ఇది ఒక రికార్డు స్థాయి బిడ్ అని స్వయంగా ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆదాయానికి ఏమాత్రం గండి పడకుండా ఈ రికార్డు స్థాయి ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఈ 35 ఏళ్ల లైసెన్స్ కాల పరిమితి ఒప్పందం ద్వారా ప్రతి నెలా ప్రభుత్వానికి సుమారు రూ. 3 కోట్ల రాబడి రానుంది. అంతేకాకుండా, ప్రతి ఏటా ఈ రాబడిపై 3 శాతం పెంపు ఉంటుంది. ఇలా 35 ఏళ్ల కాలంలో మొత్తంగా దాదాపు రూ. 2,000 కోట్ల భారీ ఆదాయం రాష్ట్ర ఖజానాకు చేరనుందని అంచనా వేస్తున్నారు. దీనికి అదనంగా, లైసెన్స్ దక్కించుకున్న సంస్థ ముందస్తుగానే రూ. 24 కోట్ల లైసెన్స్ ఫీజు చెల్లించడంతో పాటు, హోటల్ అభివృద్ధికి కనీసం రూ. 50 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు అంగీకరించింది. న్యాయపోరాటంలో సాధించిన విజయం ఫలితంగా మషోబ్రా రిసార్ట్స్ లిమిటెడ్ బ్యాంక్ ఖాతాల్లో ఉన్న రూ. 320 కోట్లతో పాటు, ఆర్బిట్రేషన్ అవార్డు ద్వారా రావలసిన మరో రూ. 25 కోట్లు, మొత్తంగా దాదాపు రూ. 400 కోట్లు నగదు రూపంలో రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలోకి జమ అయ్యాయి. ఈ చర్యతో జాయింట్ వెంచర్ కంపెనీ పూర్తిగా ప్రభుత్వ అధీనంలోకి వచ్చి, హోటల్ ల్యాండ్, ప్రాపర్టీ, దానికి సంబంధించిన అన్ని రకాల ఆస్తులపై హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వానికి పూర్తి యాజమాన్య హక్కులు దక్కాయి. గతంలో ఈ లగ్జరీ ప్రాపర్టీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ఆర్థిక ప్రయోజనం దక్కేది కాదు. అయితే సుప్రీంకోర్టుతో పాటు హిమాచల్ ప్రదేశ్ హైకోర్టులో దేశంలోనే ప్రముఖ న్యాయవాదుల సాయంతో ప్రభుత్వం బలమైన వాదనలు వినిపించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మార్చి 31న ఈ ఆస్తిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.
వైల్డ్ఫ్లవర్ హాల్ హోటల్ ను దక్కించుకున్న హిమాచల్ ప్రదేశ్ : ప్రభుత్వానికి సరికొత్త ఆదాయ వనరుగా మారిన హోటల్ : ప్రతి నెలా ప్రభుత్వానికి రూ. 3 కోట్ల రాబడి
byTelugu Lo Computer
•
•
2 min read
