ప్రముఖ సినీ నటి గౌతమి ఏఐఏడీఎంకేకు రాజీనామా చేసినట్లు అధికారికంగా ప్రకటించారు. సమాజ సేవా కార్యక్రమాల్లోనే మరింత చురుగ్గా పాల్గొనేందుకు వీలుగా ఆమె ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తన రాజీనామా పత్రాన్ని పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కే పళనిస్వామికి పంపించారు. ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె అన్నాడీఎంకే తరఫున చురుగ్గా వ్యవహరించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు కూడా. ఈ ఎన్నికల్లో ఏఐఏడీఎంకే ఓడిపోయింది. అనూహ్యంగా విజయ్ సారథ్యంలోని టీవీకే అధికారంలోకి వచ్చింది. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిణామాలను నిశితంగా పరిశీలించిన తర్వాత రాజీనామా నిర్ణయం తీసుకున్నానని గౌతమి పేర్కొన్నారు. అన్నాడీఎంకే ప్రాథమిక సభ్యత్వంతో పాటు పార్టీ ప్రచార విభాగం డిప్యూటీ సెక్రటరీ పదవుల నుంచి తప్పుకుంటున్నట్లు గౌతమి స్పష్టం చేశారు. తనతో పాటు కలిసి పనిచేసిన పార్టీ సీనియర్లు, మాజీ మంత్రులు, కార్యకర్తలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ పార్టీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నానని ఆమె రాజీనామా లేఖలో పేర్కొన్నారు. బరువెక్కిన హృదయంతో ఈ నిర్ణయం తీసుకున్నానని అన్నారు.
0 Comments