బ్రెజిల్‌లోని సావో పాలో రాష్ట్రంలో ఊహించని దారుణం జరిగింది. ఒక ప్రైవేట్ అడ్వెంచర్ కంపెనీ నిర్వహించిన బంగీ జంపింగ్ ఈవెంట్‌లో పాల్గొన్న మరియా ఎడువార్డా రోడ్రిగ్స్ డి ఫ్రీటాస్ (21) అనే యువతి, భద్రతా తాడు కట్టకుండానే వంతెన పైనుంచి కిందకు దూకడంతో ప్రాణాలు కోల్పోయింది. వంతెన అంచున ఉన్న మరియాను సిబ్బంది ముందుకు నడిపించి, కిందకు వదిలేశారు. అయితే, ఆమె శరీరానికి అత్యంత కీలకమైన సేఫ్టీ తాడును అనుసంధానించలేదనే విషయాన్ని సిబ్బంది పూర్తిగా మరిచిపోయారు. దీనిని గమనించిన అక్కడి పర్యాటకులు "తాడు.. తాడు చూడండి" అంటూ గట్టిగా కేకలు వేసేలోపే జరగరాని ఘోరం జరిగిపోయింది. మరియా వంతెన పైనుంచి నేరుగా 130 అడుగుల లోతున్న లోయలో పడిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే అత్యవసర రెస్క్యూ సిబ్బంది అక్కడికి చేరుకున్నప్పటికీ, ఆమె అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని లీగల్ మెడికల్ ఇన్‌స్టిట్యూట్‌కు తరలించారు. ఈ హృదయవిదారక దృశ్యాన్ని అక్కడే ఉన్న ఆమె కాబోయే భర్త కళ్లారా చూశాడు. కళ్లెదుటే కాబోయే భార్య ఘోరంగా మరణించడంతో అతను తీవ్ర దిగ్భ్రాంతికి గురై అనారోగ్యానికి గురయ్యాడు. ప్రస్తుతానికి అతనికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
0 Comments