Ad Code

ఆంధ్రప్రదేశ్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ తయారీ యూనిట్ ఏర్పాటు !


ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి జిల్లా సత్యవేడు మండలంలో ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్ ఫీల్డ్ భారీ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. ఈ ప్రాజెక్ట్ కోసం సంస్థ దాదాపు రూ.2,200 కోట్ల పెట్టుబడిని రెండు దశల్లో పెట్టనుంది. తమిళనాడు వెలుపల రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు ఇది తొలి ప్రధాన తయారీ విస్తరణ కావడం విశేషం. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సత్యవేడు మండలంలోని వనెల్లూరు, రాళ్లకుప్పం గ్రామాల పరిధిలో సుమారు 267 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ ప్రాజెక్ట్‌ ద్వారా రాష్ట్రంలో ఆటోమొబైల్ తయారీ రంగం మరింత బలోపేతం కానుంది. ఈ కొత్త తయారీ కేంద్రంతో రాయల్ ఎన్‌ఫీల్డ్ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం సుమారు 9 లక్షల యూనిట్లు పెరగనుంది. అలాగే ప్రత్యక్ష, పరోక్షంగా దాదాపు 5 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది. తయారీ యూనిట్‌తో పాటు వెండర్ పార్క్‌ను కూడా అభివృద్ధి చేయాలని సంస్థ ప్రణాళికలు రూపొందిస్తోంది. దీంతో అనుబంధ పరిశ్రమలు కూడా ఆ ప్రాంతానికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్‌కు రాష్ట్ర పెట్టుబడి ప్రోత్సాహక మండలి ఆమోదం తెలిపింది. మొదటి దశ పనులను 2029 నాటికి, రెండో దశను 2032 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రాష్ట్రాన్ని ఆటోమొబైల్‌, ఎలక్ట్రానిక్స్‌, అడ్వాన్స్‌డ్ మాన్యుఫాక్చరింగ్ రంగాల్లో ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని, ఈ మేరకు పెట్టుబడులు పెట్టే వారికి ప్రోత్సాహకాలు అందిస్తున్నామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. రాయల్ ఎన్‌ఫీల్డ్ వంటి దిగ్గజ సంస్థ పెట్టుబడి పెట్టడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌పై పెట్టుబడిదారుల నమ్మకం మరింత పెరుగుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. 

Post a Comment

0 Comments

Close Menu