ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతిని గుర్తించే ప్రక్రియ తుది దశకు చేరింది. లోక్‌సభలో ఇవాళ జరిగిన చర్చ అనంతరం ఈ బిల్లును సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ మేరకు ఆ బిల్లు రాజ్యసభకు అందినట్లుగా సెక్రటరీ జనరల్ అధికారికంగా ప్రకటించారు. రేపు ఉదయం రాజ్యసభలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. సుమారు ఒక గంట పాటు ఈ అంశంపై చర్చ జరిగే అవకాశం ఉంది. అయితే, జూన్ 2, 2024 నుంచి అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా ఈ బిల్లు చట్టబద్ధంగా గుర్తిస్తుంది. గతంలో వినిపించిన మూడు రాజధానుల ప్రతిపాదనలకు తావు లేకుండా, భవిష్యత్తులో ఎవరూ రాజధానిని మార్చలేని విధంగా ఉభయ సభల్లో బిల్లు ఆమోదం తర్వాత సెక్షన్-5కు సవరణలు చేయనున్నారు. ఈ బిల్లుకు అటు అధికార ఎన్డీయేతో పాటు ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా లోక్‌సభలో మద్దతు తెలపడం విశేషం. అయితే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం లోక్‌సభలో ఈ బిల్లును వ్యతిరేకిస్తూ వాకౌట్ చేసింది. రేపు రాజ్యసభలో కూడా అమరావతికి చట్టబద్ధత బిల్లు ఆమోదం పొంది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం అవ్వగానే గెజిట్ విడుదల తర్వాత అమరావతికి పూర్తిస్థాయి చట్టబద్ధత లభించనుంది.
0 Comments