ప్రపంచ వ్యాప్తంగా ఒరాకిల్ కంపెనీకి కార్యాలయాలు ఉన్నాయి. కరోనా సమయంలో ఈ కంపెనీ భారీగా లాభాలను ఆర్జించింది. అయితే ఇప్పుడు ఈ కంపెనీ లే ఆఫ్ పేరుతో ఉద్యోగులను తొలగించింది. మూకుమ్మడిగా పింక్ స్లిప్ లు ఇచ్చింది. మంగళవారం పొద్దున్నే తొలగించిన 30 వేల మంది ఉద్యోగులకు మెయిల్స్ పంపించింది. భవిష్యత్తులో ఇంకా చాలా తొలగింపులు ఉంటాయని ఒరాకిల్ పేర్కొంది. వాస్తవానికి ఇటీవల త్రైమాసికల్లో భారీగా లాభాలను ఆర్జించినప్పటికీ ఒరాకిల్ కంపెనీ ఇలా చేయడం టెక్ ఉద్యోగులకు మింగుడు పడడం లేదు. ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ లో పెట్టుబడుల కోసం ఈ కంపెనీ ఉద్యోగుల మెడ మీద కత్తిపెట్టినట్టు తెలుస్తోంది. అమెరికా, మెక్సికో, కెనడా, భారత్ లాంటి దేశాలలో పని చేస్తున్న 1.62 లక్షల మంది సిబ్బందిలో 18 శాతం మందిని తొలగిస్తున్నట్టు ఒరాకిల్ వెల్లడించింది. అమెరికా, కెనడా ప్రాంతాలలో తొలగించిన ఉద్యోగులలో భారతీయులు పెద్ద మొత్తంలో ఉన్నట్టు తెలుస్తోంది. తొలగింపునకు గురైన ఉద్యోగులలో ఎక్కువమంది మేనేజింగ్ స్థాయిలో ఉన్న వారే కావడం విశేషం. తొలగించిన ఉద్యోగులకు నెల వేతనంతో పాటు, మరో మూడు నెలల జీతం కూడా ఇవ్వనుంది. కంపెనీలో ఉన్న సర్వీస్ ఆధారంగా 15 రోజులు జీతాన్ని అదనంగా ఇస్తుంది. మార్చి 31 వరకు మిగిలి ఉన్న అన్ని సెలవులను క్యాష్ చేసుకోవడానికి అనుమతిస్తుంది. లేబర్ చట్టాల ఆధారంగా గ్రాట్యుటీ కూడా చెల్లిస్తూ ఉంటుంది. కంపెనీ నిర్దేశించిన గడువు లోగా రాజీనామా చేసిన వారికి మాత్రమే ఇవన్నీ వర్తిస్తాయని తెలుస్తోంది. తొలగించిన ఉద్యోగుల కంపెనీ లాప్టాప్ లకు ఈ యాక్సెస్ కూడా నిలిపివేసింది. ఉద్యోగులు ఉదయం లేవగానే తొలగింపు మెయిల్స్ రావడంతో చాలామంది ఆవేదన చెందారు. ఈ తొలగింపును ఒరాకిల్ చరిత్రలోనే అతి పెద్దదని భావిస్తున్నారు.
0 Comments