సూర్యకిరణాలను అంతరిక్షంలోనే ఒడిసిపట్టాలని చైనా భావిస్తోంది. స్పేస్‌లోనే సోలార్ పవర్ ప్లాంట్ నిర్మించేందుకు సిద్ధం అయింది. కరెంట్ లేకపోతే క్షణం కూడా గడవని పరిస్థితి. అందుకే విద్యుత్‌కు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన డిమాండ్ పెరిగింది. పునరుత్పాదక విద్యుత్ కోసం ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. సూర్యరశ్మి ఆధారంగా సోలార్ ఎనర్జీ క్రియేట్ చేస్తున్నారు. ఐతే సోలార్ పవర్ ప్లాంట్లను ఇప్పటివరకు భూమిపైనే చూశాం కదా.. 2028లోగా అంతరిక్షంలోనూ సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని చైనా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఎప్పటికప్పుడు వార్తల్లో నిలిచే డ్రాగన్.. ఇప్పుడు ప్రయోగంతో మరోసారి చర్చకు దారి తీసింది. స్పేస్‌లో సూర్యరశ్మిని ఉపయోగించుకొని… భూమ్మీదకు ఎలా పంపుతారు.. అసలీ ప్రయోగం వెనక చైనా అసలు వ్యూహం వేరే ఉందా అన్న అనుమానం మొదలైంది. భూమిపై ఉండే సోలార్ ప్లాంట్‌లో తయారయ్యే విద్యుత్‌ను మానవ అవసరాలకు వినియోగిస్తున్నారు. ఐతే అంతరిక్షంలో పెట్టే సోలార్ పవర్ ప్లాంట్ల నుంచి వచ్చే విద్యుత్‌ను.. వివిధ కక్ష్యల్లో తిరిగే ఉపగ్రహాల కరెంటు అవసరాలను తీర్చేందుకు ఉపయోగిస్తారు. సౌర విద్యుత్‌ను ముందు సాధారణ కరెంట్‌గా.. ఆ తర్వాత మైక్రోవేవ్‌లుగా మార్చి భూమికి పంపే పరిజ్ఞానం కూడా చైనా ఏర్పాటు చేయనున్న అంతరిక్ష సోలార్ ప్లాంట్‌లో ఉంటుంది. ఒకవేళ ఈవిధంగా సోలార్ ప్లాంట్ పనిచేయగలిగితే… అది పెద్ద అద్భుతమే అవుతుంది. ఎండ ఉన్నంత వరకు మాత్రమే భూమ్మీద సోలార్ ప్లాంట్‌లు పనిచేస్తాయ్. స్పేస్‌లో అలా కాదు.. 24 గంటలు సూర్యరశ్మి అందుబాటులోనే ఉంటుంది. ఇప్పుడు చైనా ప్రయోగం సక్సెస్ అయితే.. అంతరిక్ష ప్రయోగాల్లో మరో మెట్టు ఎక్కినట్లే ! చైనా స్పేస్ సోలార్ ప్రాజెక్ట్.. ఇప్పటికే ప్రారంభ దశలో ఉన్నట్లు తెలుస్తోంది. 2028నాటికి ఈ ప్లాంట్‌ను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నా.. అంచనా సమయం కంటే రెండేళ్ల ముందే పూర్తి చేయాలని భావిస్తోంది. సౌర అంతరిక్ష కేంద్రంలో సౌర శక్తిని చైనా విద్యుత్ మైక్రోవేవ్‌లుగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకుంది. వైర్‌లెస్ పవర్ ట్రాన్స్‌మిషన్ ద్వారా స్థిరమైన ప్రదేశాల్లో పవర్ లేజర్స్ భూమికి పంపించే అవకాశం ఉంది. అంతరిక్ష సోలార్ ప్లాంట్ సామర్ధ్యం 10 కిలోవాట్లు. దీనికి సంబంధించిన నమూనా ప్లాంట్‌ను చైనాలోని శిడియన్ యూనివర్సిటీ క్యాంపస్‌లో ఏర్పాటు చేసి పనితీరును పరీక్షించారు. ఈ సోలార్ స్టేషన్… భూమికి సౌరశక్తిని రవాణా చేయగలదని గుర్తించారు. సోలార్ పవర్ స్టేషన్ అనేది 75 అడుగుల ఎత్తులో ఉంటుంది. అంతరిక్ష జియో స్టేషనరీ ఆర్బిట్‌లో ఈ సోలార్ ప్లాంట్‌ను చైనా ఏర్పాటు చేయనుంది. చైనాలోని చొంగ క్వీన్గ్ నగరంలో 33 ఎకరాల విస్తీర్ణంలో అంతరిక్ష సోలార్ పవర్ ప్లాంట్ నమూనాను ఏర్పాటు చేసి అధ్యయనం చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. అంతరిక్షం నుంచి భూమికి మైక్రో వేవ్ రూపంలో విద్యుత్ ను పంపితే ఏవైనా అనర్ధాలు ఉంటాయా ? మైక్రోవేవ్ రేడియేషన్ సంభవిస్తుందా ? అనే ప్రశ్నలకు సమాధానాలు వెతికేందుకు డ్రాగన్ కంట్రీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. సోలార్ స్పేస్ స్టేషన్ నుంచి జనరేట్ అయ్యే విద్యుత్.. కృత్రిమ ఉపగ్రహాల కరెంట్ అవసరాలను తీర్చగా.. మిగిలే విద్యుత్‌ను సోలార్ బీమ్ రూపంలో భూమిపైకి ప్రసరింపజేస్తారు. భూమిపై నిర్మించిన ప్రత్యేక కేంద్రాలు వాటిని ఒడిసిపట్టి కరెంట్ రూపంలో నిక్షిప్తం చేస్తాయి. అంతరిక్ష రంగంలో అమెరికా, రష్యా వంటి మేటి దేశాలకు దీటుగా చైనా అనేక ఘనవిజయాలు సాధించింది. చంద్రుడి నుంచి నమూనాలు సేకరించి భూమికి తీసుకురావడంలో సక్సెస్ అయింది. అత్యంత కఠినమైన అంగారక గ్రహంపై… మొదటి ప్రయత్నంలోనే ల్యాండ్ అవడమే కాదు.. రోవర్‌ను నడిపించి పరిశోధనలు చేపట్టడం.. రోదసి పరిశోధన రంగంలో డ్రాగన్ అభివృద్ధికి నిదర్శనం. ఇలాంటి సమయంలో మరో కీలక ప్రయోగానికి, ప్రయత్నానికి చైనా సిద్ధం అయింది.
0 Comments