పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించే ప్రసక్తే లేదని ఆంధ్రప్రదేశ్ జల వనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తేల్చి చెప్పారు. ముందుగా నిర్ణయించినట్లే ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుతో నిర్మించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గత ప్రభుత్వమే ఆ ప్రాజెక్టు ఎత్తును 41.15 మీటర్లకు తగ్గించిందని.. ఏపీ శాసన మండలిలో వైకాపా సభ్యుల ప్రశ్నలకు సమాధానమిచ్చారు. క్యాబినెట్‌లో ఆమోదించడం సహా తగ్గించిన ఎత్తు ప్రకారం కావాల్సిన నిధులను విడుదల చేయాలని అప్పటి సీఎం జగన్ కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాశారని తెలిపారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను సభలో చూపించారు. 2020 వరకు ఫేజ్ 1, 2 అనేది లేదని, ఆ తర్వాతే రెండు ఫేజ్‌లుగా మార్చారని విమర్శించారు. చేసిందంతా చేసి ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు ఎత్తు 41.15 మీటర్లకు తగ్గిస్తున్నామని వైకాపా సభ్యులు తమపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. సాక్షిలో రాసిన తప్పుడు వార్తలను వైకాపా సభ్యులు సభలో మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలాగా తాము మోసం, దగా చేయబోమని, పూర్తి స్థాయి ఎత్తులోనే ప్రాజెక్టును నిర్మిస్తామని స్పష్టం చేశారు.
0 Comments