బంగాళాఖాతం మీదుగా నింగిలో శాస్త్రవేత్తలు ఒక అరుదైన, ఇంతకుముందెన్నడూ చూడని వింతను గుర్తించారు. ఉత్తర బంగాళాఖాతానికి పైన వాతావరణంలో అత్యంత మందపాటి ఓజోన్ పొర కేంద్రీకృతమై ఉన్నట్లు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ - ఇస్రో ఇతర దేశీయ పరిశోధన సంస్థలు సంయుక్తంగా చేపట్టిన అధ్యయనంలో తేలింది. దేశవ్యాప్తంగా నిర్వహించిన ప్రత్యేక వాతావరణ పరిశీలన ప్రాజెక్ట్ (నేట్‌రాడ్-ఆస్మా)లో భాగంగా ఈ వినూత్న ఘట్టం వెలుగులోకి వచ్చింది. భూ ఉపరితలానికి దాదాపు 21 నుంచి 23 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న దిగువ స్ట్రాటోస్ఫియర్ పొరలో ఈ దట్టమైన ఓజోన్ కేంద్రీకృతమై ఉన్నట్లు గుర్తించారు. తూర్పు భారతదేశంపై సాధారణంగా ఉండే ఓజోన్ సాంద్రత కంటే ఇది చాలా ఎక్కువ స్థాయిలో ఉండడమే కాకుండా, రోజంతా ఒకే చోట స్థిరంగా కొనసాగడం శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురిచేసింది. సాధారణంగా సూర్యరశ్మి వల్ల జరిగే రసాయన చర్యల కారణంగానే ఓజోన్ పరిమాణంలో మార్పులు వస్తుంటాయి. కానీ, ఈసారి రాత్రి, పగలు తేడా లేకుండా రెండు సమయాల్లోనూ ఈ దట్టమైన ఓజోన్ పొర ఒకేలా కనిపించడం గమనార్హం. దీనికి కారణం రసాయన చర్యలు కాదని, గాలి తీవ్రత, గాలి దిశలో వచ్చిన మార్పుల వల్ల ఎగువ వాతావరణంలోని ఓజోన్ ప్రవాహం కిందికి నెట్టబడి ఒకే చోట కుదించుకుపోవడమేనని సైంటిస్టులు విశ్లేషించారు. భూమిపై నివసించే జీవకోటిని సూర్యుడి నుంచి వచ్చే ప్రమాదకరమైన యూవీ కిరణాల నుంచి కాపాడే సహజ సిద్ధమైన కవచమే ఈ ఓజోన్ పొర. నైనితాల్‌లోని ఆర్యభట్ట పరిశోధనా సంస్థ శాస్త్రవేత్తలు స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన అత్యాధునిక రాడార్లు, ఇన్సాట్-3డిఆర్ వంటి ఉపగ్రహాలు, వాతావరణ బెలూన్ల సహాయంతో ఈ అంతరిక్ష దృగ్విషయాన్ని స్పష్టంగా నమోదు చేశారు. మన ఉప ఉష్ణ మండల ప్రాంతాల్లో వాతావరణ మార్పులు ఎలా జరుగుతాయో అర్థం చేసుకోవడానికి ఈ ప్రయోగం ఎంతో ఉపయోగపడుతుందని అమెరికన్ జియోఫిజికల్ యూనియన్ పత్రికలో ప్రచురితమైన నివేదిక పేర్కొంది.
0 Comments