వైసీపీ సీనియర్ నేత, శాసనసభ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కుటుంబంపై భూ కబ్జా కుట్ర కేసు నమోదైంది. భూమి అసలు యజమాని ప్రాణాలతో బ్రతికి ఉండగానే ఆయన మరణించినట్లు నకిలీ మరణ ధృవీకరణ పత్రాన్ని సృష్టించి, తప్పుడు వారసత్వ పత్రాల ఆధారంగా ఆ విలువైన భూమిని కొట్టేయాలని చూశారనేది ఈ కేసు ప్రధాన సారాంశం. బాధితుడైన అసలు యజమాని కుటుంబ సభ్యులు ఇచ్చిన లిఖితపూర్వక ఫిర్యాదుపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టి, ఈ భారీ కుట్రను ఛేదించారు. ఈ కేసులో పోలీసులు దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ లో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కుటుంబ సభ్యుల పేర్లను నిందితులుగా చేర్చారు. ఈ కేసులో తమ్మినేని సీతారాం తనయుడు తమ్మినేని చిరంజీవి నాగ్‌ను ఐదో నిందితుడిగా, తమ్మినేని సీతారాంను ఆరో నిందితుడిగా, ఆయన భార్య తమ్మినేని వాణిని ఏడో నిందితురాలిగా పోలీసులు కేసులో చేర్చారు. అధికారంలో ఉన్నప్పుడే ఫోర్జరీ లావాదేవీలకు పాల్పడ్డారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కేసుకు సంబంధించిన పురోగతిపై జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ మీడియాతో మాట్లాడుతూ కీలక వివరాలు వెల్లడించారు. నకిలీ పత్రాల సృష్టి, ఫోర్జరీ, భూ కబ్జా కుట్రతో ప్రత్యక్షంగా సంబంధం ఉన్న ఎనిమిది మంది నిందితులను ఇప్పటికే అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని స్పష్టం చేశారు. ప్రభుత్వ రికార్డులను తారుమారు చేసి, బ్రతికి ఉన్న వ్యక్తిని చనిపోయినట్లు చూపించి భూమిని బదలాయించుకునే ప్రయత్నంలో తెర వెనుక పెద్ద నెట్‌వర్క్ పనిచేసిందని, ఇందులో ఎవరినీ విడిచిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఏ5, ఏ6, ఏ7 లుగా ఉన్న తమ్మినేని కుటుంబ సభ్యుల పాత్రపై పోలీసులు పూర్తిస్థాయి సాంకేతిక, డాక్యుమెంటరీ ఆధారాలను సేకరిస్తున్నారు. తమ్మినేని సీతారాం కుటుంబంపై నిష్పాక్షికంగా దర్యాప్తు జరిపి, త్వరలోనే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ ప్రకటించారు.