విశాఖపట్నానికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని లెంక రాధాగాయత్రి అనుమానాస్పద మృతి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఆమె భర్త శ్రీచరణ్ ను ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. డెహ్రాడూన్ డీఎస్పీ జేసీ పంత్ ఆధ్వర్యంలో పోలీసు బృందం ప్రస్తుతం ఈ కేసులో లోతుగా దర్యాప్తు చేస్తోంది. శ్రీచరణ్ ను కోర్టులో హాజరుపరిచి, పోలీస్ కస్టడీకి తీసుకుని రాధాగాయత్రి మృతికి సంబంధించి విచారణ చేపట్టేందుకు సన్నద్ధమవుతున్నారు. విజయనగరం జిల్లాకు చెందిన రాధాగాయత్రి తల్లిదండ్రులు సుధాకర్, సత్యవతి తమ కుమార్తె మృతిపై న్యాయం చేయాలంటూ ఉత్తరాఖండ్లోని డెహ్రాదూన్లో న్యాయపోరాటం చేస్తున్నారు. రాధాగాయత్రిది ఆత్మహత్య కాదని, ఆమె భర్త శ్రీచరణే పక్కా ప్లాన్ ప్రకారం హత్య చేశాడని ఆమె తండ్రి సుధాకర్ మొదటి నుంచి గట్టిగా ఆరోపిస్తున్నారు. పెళ్లి జరిగిన కొద్ది రోజుల నుంచే అదనపు కట్నం కోసం, ఆర్థిక ప్రయోజనాల కోసం శ్రీచరణ్, అతని కుటుంబ సభ్యులు రాధాగాయత్రిని వేధించేవారని, ఈ క్రమంలోనే ముస్సోరీ టూర్కు తీసుకెళ్లి ఆమెను హతమార్చారని బాధితురాలి కుటుంబం ఆరోపిస్తోంది. ఈ ఘోర ఉదంతంపై సమగ్ర విచారణ జరపాలని డెహ్రాడూన్ జిల్లా కలెక్టర్ ఆదేశించడంతో కేసు దర్యాప్తు వేగవంతమైంది. కలెక్టర్ ఆదేశాల మేరకు ముస్సోరీ డివిజనల్ మెజిస్ట్రేట్ రాహుల్ ఆనంద్ అధికారికంగా మెజిస్టీరియల్ దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో భాగంగా జూన్ 14 నుండి జూన్ 16 మధ్య కాలంలో ముస్సోరీలోని హోటల్లో, ఆ ఘటనా స్థలంలో అసలు ఏం జరిగింది? భార్యాభర్తల మధ్య అంతా సరిగ్గా ఉందా లేదా ? అనే విషయాలపై అధికారులు డిజిటల్ ఆధారాలను, హోటల్ సీసీటీవీ ఫుటేజీలను సేకరిస్తున్నారు. ఈ కేసులో స్థానిక పోలీసులు పోస్ట్మార్టం నిర్వహించిన సిబ్బంది పాత్రపై కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాధాగాయత్రి తల్లిదండ్రులు విశాఖ నుండి ఉత్తరాఖండ్ చేరుకోక ముందే, వారికి కనీస సమాచారం ఇవ్వకుండా, శవపరీక్షను అత్యవసరంగా ముగించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఆ ఆసుపత్రి సిబ్బందిని, దర్యాప్తులో నిర్లక్ష్యం వహించిన స్థానిక పోలీసులను కూడా మెజిస్ట్రేట్ విచారించే అవకాశం ఉంది.
0 Comments