Ad Code

ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించనున్న సనత్ నగర్ టిమ్స్ : ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి రాజనర్సింహ

హైదరాబాద్‌లోని సనత్‌నగర్ ప్రాంతంలో నిర్మించిన అత్యాధునిక టిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ ను త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నామని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రకటించారు. ఈ ప్రారంభోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లను మంత్రి దామోదర్ రాజనర్సింహ నేడు పరిశీలించారు. హాస్పిటల్ సంసిద్ధతను సమగ్రంగా సమీక్షించిన మంత్రి, అన్ని విభాగాల్లోని పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మంత్రి హాస్పిటల్‌లోని ఏ,బీ,సీ బ్లాకులను సందర్శించి, ఔట్ పేషెంట్ రిజిస్ట్రేషన్ కౌంటర్లు, ఇన్‌పేషెంట్ వార్డులు, ఎమర్జెన్సీ విభాగం, ఐసీయూలు, అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు, సీటీ స్కాన్, ఎంఆర్‌ఐ, డిజిటల్ ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్, డయాగ్నస్టిక్ ల్యాబొరేటరీలు, బ్లడ్ బ్యాంక్, మెకనైజ్డ్ లాండ్రీ, సెంట్రలైజ్డ్ కిచెన్, ఫార్మసీ విభాగాలను పర్యవేక్షించారు. వైద్య పరికరాలు, మౌలిక సదుపాయాలు, సేవా వ్యవస్థలను స్వయంగా పరిశీలించి అధికారులకు అవసరమైన సూచనలు ఇచ్చారు. ప్రారంభానికి ముందు మిగిలి ఉన్న అన్ని పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఆర్‌ అండ్‌ బీ, ఆరోగ్యశాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. రోగులకు ఎలాంటి అసౌకర్యం ఏర్పడకుండా నీటి సరఫరా, విద్యుత్ సరఫరా, పారిశుధ్యం, సెక్యూరిటీ, ఫైర్ సేఫ్టీ వ్యవస్థలను అత్యున్నత స్థాయిలో సిద్ధం చేయాలని సూచించారు. ఔట్‌పేషెంట్ కౌంటర్లు, రిజిస్ట్రేషన్ విభాగాలు, హెల్ప్ డెస్కులు, ఫార్మసీ సేవలు, వెయిటింగ్ ఏరియాలను మరింత సౌకర్యవంతంగా, సమర్థవంతంగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సీటీ స్కాన్, ఎంఆర్‌ఐ వంటి అత్యాధునిక యంత్రాలను పూర్తి సామర్థ్యంతో నడపడానికి అవసరమైన డాక్టర్లు, టెక్నీషియన్లు, సిబ్బందిని తక్షణం సిద్ధం చేయాలని మంత్రి సూచించారు. ఈ హాస్పిటల్‌ను గుండె సంబంధిత వ్యాధులు, అవయవ మార్పిడి శస్త్రచికిత్సలకు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. క్యాథ్ ల్యాబులు, ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ సదుపాయాలు, అత్యుత్తమ ఆపరేషన్ థియేటర్లు ప్రజలకు ప్రపంచ స్థాయి వైద్య సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నాయని మంత్రి చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్ష మేరకు పేదలు కూడా కార్పొరేట్ స్థాయి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను పొందేలా సనత్‌నగర్ టిమ్స్ హాస్పిటల్‌ను తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ అత్యుత్తమ, ప్రపంచ స్థాయి వైద్య సేవలు అందించే అగ్రశ్రేణి సంస్థగా టిమ్స్ నిలవాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు. రోగులతో పాటు వారి సహాయకుల సౌకర్యాలను కూడా ప్రత్యేక దృష్టితో చూడాలని మంత్రి సూచించారు. ధర్మశాలలు, క్యాంటీన్లు, పార్కింగ్ స్థలాలు, హాస్టల్ బ్లాకులు, ఇతర సహాయక సేవలను పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఈ హాస్పిటల్ రాష్ట్ర వైద్య రంగంలో ఒక మైలురాయిగా నిలవనుందని ఆయన తెలిపారు.

Post a Comment

0 Comments

Close Menu