Ad Code

నర్సింగ్ విద్యార్థినిపై ట్యూటర్‌ వేధింపులు : విధుల్లో నుంచి శాశ్వతంగా తొలగుంపు

తెలంగాణలోని నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కళాశాల అనుబంధ నర్సింగ్ కాలేజీలో నర్సింగ్ ద్వితీయ సంవత్సరం  చదువుతున్న ఒక విద్యార్థినిని అదే కాలేజీలో ట్యూటర్‌గా పనిచేస్తున్న గౌతమ్ గత కొంతకాలంగా వేధింపులకు గురిచేస్తున్నట్లు వెల్లడైంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. బాధితురాలి ఫిర్యాదు ప్రకారం.. ట్యూటర్ గౌతమ్ సోషల్ మీడియా వేదికలైన వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌ల ద్వారా సదరు నర్సింగ్ విద్యార్థినికి నిరంతరం అసభ్యకరమైన మెసేజ్‌లు పంపుతూ తీవ్రంగా లైంగిక వేధింపులకు గురిచేశాడు. దీనిపై బాధితురాలు వన్‌టౌన్ పోలీసులను ఆశ్రయించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. విద్యార్థిని ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నిందితుడైన ట్యూటర్ గౌతమ్‌పై పోలీసులు పలు కఠిన సెక్షన్ల కింద క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఈ వేధింపుల ఉదంతాన్ని తీవ్రంగా పరిగణించిన కళాశాల యాజమాన్యం , ఉన్నతాధికారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించి, నిబంధనలు ఉల్లంఘించినందుకు గానూ ట్యూటర్ గౌతమ్‌ను విధుల్లో నుంచి శాశ్వతంగా తొలగిస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు, కేసు నమోదు కావడంతో నిందితుడైన డాక్టర్ గౌతమ్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని వన్‌టౌన్ ఎస్.హెచ్.ఓ రఘుపతి మీడియాకు తెలిపారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని, అతి త్వరలోనే అతడిని పట్టుకుని చట్టం ముందు నిలబెడతామని ఆయన స్పష్టం చేశారు. ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు, తోటి విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

Post a Comment

0 Comments

Close Menu