Ad Code

దోమల ద్వారా వ్యాపించే వ్యాధులను అరికట్టేందుకు గూగుల్ వినూత్న ప్రయోగం


గూగుల్ సంస్థ ఓ వినూత్న ప్రయోగానికి తెరలేపింది. దోమల ద్వారా వ్యాపించే వ్యాధులను అరికట్టేందుకు ఆ సంస్థ పూనుకున్నది . దీనిలో భాగంగా ప్రయోగశాల్లో అభివృద్ధి చేసిన సుమారు 6.4 కోట్ల బయో దోమలను అమెరికాలో రిలీజ్ చేయనున్నది. తొలుత ఈ ప్రాజెక్టును ఫ్లోరిడా, కాలిఫోర్నియాలో చేపట్టనున్నది. దీని కోసం ప్రభుత్వం అనుమతి కోరింది గూగుల్(Google) సంస్థ. అసలైన దోమల జనాభాను నియంత్రించే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టు చేపట్టారు. వ్యాధికారక దోమల జనాభాను తగ్గించనున్నారు. గూగుల్ ప్లానింగ్‌కు చెందిన అంశం ప్రస్తుతం యూఎన్ పర్యావరణ పరిరక్షణ సంస్థ(ఈపీఏ) ఆధీనంలో ఉన్నది. రాబోయే రెండేళ్లలో ఫ్లోరిడా, కాలిఫోర్నియాలో ల్యాబ్‌లో పెరిగిన మగ దోమలను వాతావరణంలోకి రిలీజ్ చేయనున్నారు. దోమల నియంత్రణ కోసం గూగుల్ సంస్థ డీబగ్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ ప్రాజెక్టును 2014లో ఆవిష్కరించారు. దోమల ద్వారా వ్యాపించే వ్యాధులను అరికట్టేందుకు ఆ వినూత్న ప్రాజెక్టును అప్పట్లో ప్రారంభించారు. రసాయనాలు, క్రిమిసంహారకాలపై ఆధారపడకుండా సహజసిద్దమైన బ్యాక్టీరియా వోల్‌బాచియా పిపెంటిస్ ద్వారా ప్రమాదకర దోమలను అంతం చేయాలని భావిస్తున్నారు. మగ దోమలకు ఆ బ్యాక్టీరియాను ఎక్కిస్తారు. ఆ తర్వాత వాటిని అడవుల్లోకి రిలీజ్ చేస్తారు. అయితే ఆడ, మగ దోమలు కలిసిన తర్వాత వచ్చే గుడ్లు ఫలదీకరణ చెందవని గూగుల్ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇక పదేపదే ఈ ప్రయోగం చేపట్టడం వల్ల వ్యాధికారక దోమల జనాభాను తగ్గించే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. కేవలం ఆడ దోమలు మాత్రం మనుషులను కుడుతుంటాయి. ఇక అడవుల్లోకి రిలీజ్ చేసిన మగ దోమలు మనుషులను కుట్టవు. అంటే ఈ ప్రయోగం వల్ల దోమల నుంచి సంభవించే అనర్థాలు తక్కువే అని గూగుల్ సంస్థ చెబుతోంది. ఇంతకీ ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందో లేదో చూద్దాం. గూగుల్ సంస్థ సుమారు 3.2 కోట్ల దోమలను ప్రతి ఏడాది రిలీజ్ చేయాలని భావిస్తున్నది. దీని ద్వారా మొత్తం 6.4 కోట్ల దోమలను పర్యావరణంలోకి రిలీజ్ చేస్తారు. పరిశోధనశాల్లో వోల్బాచియా బ్యాక్టీరియా ఎక్కించిన మగదోమలను దశలవారీగా విడుదల చేయనున్నారు. ఒకవేళ ఈ ప్రాజెక్టుకు అప్రూవల్ దక్కితే, అప్పుడు దోమల నియంత్రణ కోసం అమెరికా చేపట్టిన అతి పెద్ద ప్రాజెక్టు ఇదే అవుతుంది. ఈ ప్రతిపాదనపై ప్రస్తుతం ఈపీఏ పరిశీలన చేస్తున్నది. పబ్లిక్ నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకుంటోంది. ఇప్పటి వరకు కచ్చితంగా ఏ ప్రదేశంలో ఆ దోమల్ని రిలీజ్ చేస్తారన్న విషయాన్ని వెల్లడించలేదు. గతంలో ఇలాంటి పద్ధతి ద్వారా దోమల నియంత్రణ చేపట్టినట్లు తెలుస్తోంది. వోల్బాచికా బ్యాక్టీరియా విధానాన్ని అనేక దేశాలు అమలు చేసినట్లు తెలుస్తోంది. ఇదే పద్ధతిలో ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా వంద కోట్లకుపైగా దోమలను రిలీజ్ చేసినట్లు గూగుల్ సంస్థ చెబుతోంది. ఈ ప్రయోగం వల్ల దోమల జనాభాను తగ్గించారు. వ్యాధికారక దోమలు కూడా తగ్గాయి. దోమలు చాలా ప్రాణాంతక జీవులు. అనేక వ్యాధుల వ్యాప్తికి దోమలే కారణం. డెంగ్యూ, జికా, చికున్‌గునియా, ఎల్లో ఫీవర్‌, మలేరియా లాంటి వ్యాధులు దోమల వల్లే వ్యాప్తి అవుతుంటాయి. అయితే దోమల నియంత్రణ కోసం ప్రభుత్వాలు అనేక రకాల చర్యలు చేపడుతూనే ఉన్నాయి. తాజాగా గూగుల్ చేపట్టబోయే ప్రయోగం పట్ల చర్చ ఆన్‌లైన్‌లో కొనసాగుతోంది. వోల్బాచియా టెక్నాలజీ మెరుగైనదే అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కానీ లక్షల సంఖ్యలో ల్యాబ్ దోమలను వదలడం పట్ల విమర్శలు వస్తున్నాయి. క్రిమిసంహారకాలు లేకుండా దోమలను అరికట్టవచ్చు అని ఆ ప్రాజెక్టు మద్దతుదారులు చెబుతున్నారు. కానీ ఆ ప్రాజెక్టుకు అనుమతి దక్కితే దీర్ఘకాలిక పర్యావరణ ప్రభావం ఉంటుందని విమర్శకులు ఆరోపిస్తున్నారు. గూగుల్ చేపట్టబోయే ప్రాజెక్టుకు ఇంకా ఈపీఏ అనుమతి దక్కలేదు. 

Post a Comment

0 Comments

Close Menu