Ad Code

తమిళనాడులో అన్నామలై కొత్త పార్టీ ?


మిళనాడులో బీజేపీ అధిష్ఠానంతో విభేదాలు, పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవడం వంటి పరిణామాలతో అసంతృప్తిగా ఉన్న అన్నామలై సొంతంగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇటీవలి కాలం వరకు ఆయనను ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపి, కేంద్రమంత్రి పదవిని కట్టబెడతారని పెద్ద ఎత్తున ఊహాగానాలు వినిపించినప్పటికీ.. ప్రస్తుత రాజకీయ సమీకరణాల వల్ల ఆ అవకాశాలు లేవని తేలిపోవడంతో అన్నామలై తన భవిష్యత్తుపై కొత్త నిర్ణయం తీసుకున్నట్లు పొలిటికల్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. బీజేపీ జాతీయ నాయకత్వం పట్ల అసంతృప్తిగా ఉన్నారో, లేక జాతీయ పార్టీ పరిధిలో ఉంటే ప్రాంతీయంగా తమిళనాడులో తగినంతగా ఎదగలేమని భావిస్తున్నారో కానీ.. అన్నామలై సొంత కుంపటి పెట్టడానికే మొగ్గు చూపుతున్నట్లు ఆయన అనుచరుల హడావుడిని బట్టి అర్థమవుతోంది. ఇప్పటికే కోయంబత్తూరుతో పాటు తమిళనాడులోని పలు ప్రధాన నగరాల్లో ఆయన మద్దతుదారులు భారీ పోస్టర్లు వేసి కలకలం రేపారు. మక్కల్ శక్తి ఇయక్కం వంటి పేర్లతో కొత్త మూవ్‌మెంట్‌ను ప్రారంభించబోతున్నారనే లీకులు బయటకు రావడం, నాయకుడా, వచ్చి మమ్మల్ని నడిపించు అంటూ అభిమానులు పోస్టర్ల ద్వారా పిలుపునివ్వడం తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సంచలన ప్రచారాలపై అన్నామలై మాత్రం ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయకుండా వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు. ఆయన జూన్ 3వ తేదీన ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఈ మీడియా సమావేశంలోనే తన రాజకీయ భవిష్యత్ కార్యాచరణను వెల్లడించే అవకాశం ఉందని భావిస్తున్నారు. తన పుట్టినరోజు జూన్ 4 కంటే ఒక రోజు ముందే ఆయన ఈ కీలక ప్రకటన ద్వారా కొత్త రాజకీయ ప్రయాణానికి శ్రీకారం చుడతారని అంచనా వేస్తున్నారు.

Post a Comment

0 Comments

Close Menu