Ad Code

హ్యాట్రిక్‌ గోల్‌తో మెరిసిన లియోనెల్ మెస్సీ : అల్జీరియాను 3-0 తేడాతో ఓడించిన అర్జెంటీనా

ఫిఫా ప్రపంచకప్ 2026 టోర్నీలో భాగంగా అల్జీరియాతో జరిగిన మ్యాచ్‌లో లియోనెల్ మెస్సీ హ్యాట్రిక్‌ గోల్‌తో మెరిసాడు. అర్జెంటీనా 3-0 తేడాతో అల్జీరియాను ఓడించి మెగా టోర్నీలో శుభారంభం చేసింది. ఈ మ్యాచ్ ద్వారా లియోనెల్ మెస్సీ వరల్డ్ రికార్డ్ నమోదు చేశాడు. ఆరు ప్రపంచకప్‌లు ఆడిన తొలి పురుష ఆటగాడిగా నిలిచాడు. అంతేకాకుండా ఈ 6 ప్రపంచకప్‌ టోర్నీల్లో మెస్సీకి ఇదే తొలి హ్యాట్రిక్ గోల్ కావడం గమనార్హం. 39 ఏళ్ల వయసులోనే ఈ ఘనత సాధించి ఏజ్ జస్ట్ నెంబర్ మాత్రమేనని చాటి చెప్పాడు. గ్రూప్ జేలో భాగంగా అమెరికాలోని కాన్సాస్ సిటీ స్టేడియంలో బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా పూర్తి ఆధిపత్యం చెలాయించింది. మ్యాచ్ ప్రారంభమైన 17వ నిమిషంలోనే మెస్సీ తొలి గోల్ నమోదు చేశాడు. అలెక్సిస్ మాక్ అల్టిస్టర్ ఇచ్చిన పాస్‌ను అందుకున్న మెస్సీ.. తన ఎడమ కాలుతో చాకచక్యంగా గోల్‌పోస్ట్‌లోకి పంపాడు. మెస్సీ మ్యాజిక్‌తో అల్జీరియా గోల్ కీపర్ లూకా జిదాన్ తేలిపోయాడు. ఆ తర్వాత ఇరు జట్లు హోరాహోరీగా తలపడటంతో ఫస్టాఫ్‌ను అర్జెంటీనా 1-0తో ముగించింది. సెంకాడాఫ్‌లో 17 నిమిషాల వ్యవధిలోనే మెస్సీ రెండు గోల్స్ నమోదు చేశాడు. 60వ నిమిషంలో, 77వ నిమిషంలో గోల్స్ కోట్టి ప్రపంచకప్ చరిత్రలో తన తొలి హ్యాట్రిక్‌ను నమోదు చేశాడు. ఈ హ్యాట్రిక్ గోల్స్‌తో అర్జెంటీనా విజయం ఖరారైంది. ఈ హ్యాట్రిక్స్‌తో ప్రపంచకప్‌లో మెస్సీ మొత్తం గోల్స్ సంఖ్య 16కి పెరిగింది. దాంతో ప్రపంచకప్‌లో అత్యధిక గోల్స్ చేసిన జర్మనీ ప్లేయర్‌ మిరోస్లావ్ క్లోస్ (16 గోల్స్) రికార్డ్‌ను మెస్సీ సమం చేశాడు. ఈ క్రమంలో క్రిస్టియన్ రొనాల్డో(15 గోల్స్) రికార్డ్‌ను మెస్సీ అధిగమించాడు. 14 గోల్స్‌తో ఎంబాపే, గెర్డ్ ముల్లర్ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు. ఈ మ్యాచ్‌లో తన తొలి గోల్‌తో ప్రపంచకప్‌లో పెనాల్టీ బాక్స్ బయటి నుంచి ఐదు గోల్స్ నమోదు చేసిన బ్రెజిల్ దిగ్గజం రివెల్లినో రికార్డ్‌ను మెస్సీ సమం చేశాడు. అంతేకాకుండా ప్రపంచకప్‌లో అర్జెంటీనా తరఫున గోల్ చేసిన అత్యంత పిన్న వయస్కుడిగా, పెద్ద వయస్కుడిగా కూడా మెస్సీ రికార్డ్ సాధించాడు. 19 ఏళ్ల వయసులో 2006 ఫిఫా ప్రపంచకప్‌లో తొలి గోల్ చేసిన మెస్సీ.. 20 ఏళ్ల తర్వాత 39 ఏళ్ల వయసులోనూ తన ఆరో ప్రపంచకప్‌లో గోల్ కొట్టాడు. 2022 ప్రపంచకప్ విజయం తర్వాత మెస్సీ వీడ్కోలు పలుకుతాడని ప్రచారం జరిగినా.. అర్జెంటీనాకు సారథిగా కొనసాగుతున్నాడు.

Post a Comment

0 Comments

Close Menu