Ad Code

మూడు వేర్వేరు పార్టీల నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన మార్టిన్ కుటుంబం


ప్రముఖ వ్యాపారవేత్త శాంటియాగో మార్టిన్ కుటుంబం మూడు వేర్వేరు పార్టీల నుంచి, మూడు వేర్వేరు నియోజకవర్గాల్లో పోటీ చేసి, ముగ్గురూ విజయం సాధించి అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. శాంటియాగో మార్టిన్ భార్య లీమారోజ్ మార్టిన్ తమిళనాడులోని లాల్‌గుడి నియోజకవర్గం నుంచి ఏఐఏడీఎంకే అభ్యర్థిగా పోటీ చేసిగత 20 ఏళ్లుగా డీఎంకేకు కంచుకోటగా ఉన్న  స్థానంలో సంచలన విజయం నమోదు చేశారు. మార్టిన్ అల్లుడు ఆధవ్ అర్జున తమిళగ వెట్రి కళగం తరపున తన సత్తా చాటారు. టీవీకే జనరల్ సెక్రటరీగా ఉన్న ఆయన.. విక్కివాక్కం నియోజక వర్గంలో డీఎంకే అభ్యర్థి కార్తీక్ మోహన్‌పై 17,302 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. తమిళనాడు లోనే కాకుండా పొరుగున ఉన్న పుదుచ్చేరిలోనూ మార్టిన్ కుటుంబ జైత్రయాత్ర కొనసాగింది. శాంటియాగో మార్టిన్ కుమారుడు జోస్ చార్లెస్ మార్టిన్ తన సొంత పార్టీ అయిన లచ్చియ జననాయక కట్చి తరపున కామరాజ్ నగర్ నుంచి బరిలోకి దిగి కాంగ్రెస్ అభ్యర్థిని 10,000 ఓట్ల భారీ తేడాతో ఓడించి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. గతంలో ఎలక్టోరల్ బాండ్ల ద్వారా భారీగా విరాళాలు ఇచ్చి వార్తల్లో నిలిచిన మార్టిన్ కుటుంబం, ఇప్పుడు నేరుగా అధికార పీఠాలను అధిరోహించడం విశేషం. భార్య ఏఐఏడీఎంకేలో, అల్లుడు టీవీకేలో, కొడుకు సొంత పార్టీలో ఉండటం ద్వారా, ఒకే కుటుంబం నుంచి ముగ్గురు వ్యక్తులు వేర్వేరు జెండాలతో విజయం సాధించి ‘పొలిటికల్ జాక్‌పాట్’ కొట్టడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

Post a Comment

0 Comments

Close Menu