Ad Code

పద్మజ మృతి కేసు ఛేదించిన పోలీసులు : భర్తే నిందితుడు


ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లా ప్రొద్దుటూరులో సంచలనం సృష్టించిన పద్మజ మృతి కేసును పోలీసులు ఛేదించారు. తొలుత అనుమానాస్పద మృతిగా భావించిన ఈ ఘటన, పోలీసుల లోతైన విచారణలో పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన హత్యగా తేలింది. భార్యను వదిలించుకోవాలని పథకం వేసిన భర్త కిరణ్ కుమారే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు నిర్ధారించి, అతడిని అరెస్ట్ చేశారు. ఏప్రిల్ 30న పద్మజ మరణించినట్లు కేసు నమోదైంది. అయితే ఆమె మృతి చెందిన తీరుపై అనుమానాలు రావడంతో పోలీసులు పోస్టుమార్టం నిర్వహించారు. నివేదికలో ఆమెది సహజ మరణం కాదని తేలడంతో, భర్త కిరణ్ కుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజాలు బయటపడ్డాయి. ప్రొద్దుటూరు ఏఎస్పీ విభూ కృష్ణ ఈ కేసుకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. పోలీసుల కథనం ప్రకారం కిరణ్ కుమార్‌కు మరో మహిళతో అక్రమ సంబంధం ఉంది. ఈ విషయంలో భార్య పద్మజ తరచూ నిలదీయడం, ఇద్దరి మధ్య గొడవలు జరగడంతో ఆమెను చంపాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం హత్య ఎలా చేయాలనే అంశంపై కిరణ్ యూట్యూబ్‌లో సెర్చ్ చేశాడు. అజ్ఞాత వ్యక్తులతో సంప్రదింపులు జరిపి, హైదరాబాద్ నుంచి కొరియర్ ద్వారా విషాన్ని తెప్పించుకున్నాడు. ఏప్రిల్ 29న పద్మజకు ఇష్టమైన స్వీట్ పాలకోవాలో ఆ విషాన్ని కలిపి తినిపించాడు. విషం తిన్న పద్మజ అపస్మారక స్థితిలోకి వెళ్లగా, ఆమె పూర్తిగా చనిపోయిందో లేదోనన్న అనుమానంతో ముఖంపై దిండు పెట్టి ఊపిరాడకుండా చేసి ప్రాణాలు తీశాడు. ఈ హత్యలో కిరణ్ ప్రియురాలికి ఎటువంటి సంబంధం లేదని, నిందితుడు ఒక్కడే ఈ కుట్ర పన్నినట్లు ఏఎస్పీ స్పష్టం చేశారు. విషం విక్రయించిన వ్యక్తిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. నిందితుడు కిరణ్ కుమార్‌ను కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.

Post a Comment

0 Comments

Close Menu