ఆంధ్రప్రదేశ్ లోని మార్కాపురం జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ రవాణా విస్తృతంగా జరుగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా మార్కాపురం, పెద్దారవీడు, తర్లుపాడు మండలాల్లో రేషన్ మాఫియా యథేచ్ఛగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు సమాచారం. పేదలకు అందాల్సిన సన్న బియ్యం, రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆటోలు, మినీ వ్యాన్‌లు, బొలెరో వాహనాల ద్వారా రేషన్ బియ్యాన్ని రహస్యంగా తరలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం బయటకు వస్తోంది. ప్రతి నెల సుమారు రూ.2 కోట్లకు పైగా విలువైన రేషన్ బియ్యం ఈ మూడు మండలాల నుంచి అక్రమంగా తరలిపోతున్నట్లు అంచనాలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో కొందరు అధికార పార్టీ నేతలే బ్లాక్ మార్కెట్‌కు సూత్రధారులుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు మరింత చర్చనీయాంశంగా మారాయి. గత 20 నెలలుగా ఈ అక్రమ రవాణా కొనసాగుతున్నప్పటికీ, సంబంధిత వాహనాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడంలో సివిల్ సప్లై శాఖ అధికారులు విఫలమయ్యారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రేషన్ దుకాణాలపై తనిఖీలు నిర్వహిస్తున్నప్పటికీ, కేసులు నమోదు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు తక్షణమే స్పందించి రేషన్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పేదలకు అందాల్సిన ధాన్యం వారికి సక్రమంగా చేరేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
0 Comments