డ్వాక్రా సంఘాల మహిళల కుమార్తెల పెళ్లికి రూ.లక్ష వరకు పావలా వడ్డీకి రుణం


ఆంధ్రప్రదేశ్ లోని డ్వాక్రా మహిళల కుమార్తెల పెళ్లికి లక్ష రూపాయాల వరకు రాయితీ వడ్డీ రేట్లకే రుణం రూపంలో అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే మహిళలకు చిరు వ్యాపారాలకు ప్రభుత్వం రుణాలు అందిస్తోంది. ఇప్పుడు వారింట ఆడ బిడ్డల వివాహాలకు ఆర్దికంగా చేయూత ఇవ్వాలని నిర్ణయించింది. ఈ పథకాన్ని "కల్యాణలక్ష్మి" పేరుతో అమలుకు నిర్ణయం తీసుకుంది. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు సెర్ఫ్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఈ మేరకు ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. ఈ కల్యాణ లక్ష్మీ పథకం అమలు బాధ్యతలను సెర్ప్​, స్త్రీనిధి సంస్థలకు అప్పగించారు. పథకం అమల్లో భాగంగా డ్వాక్రా సంఘాల ఆడబిడ్డల వివాహనికి ఈ పథకం కింద రూ.10 వేల నుంచి రూ.లక్ష వరకూ పావలా వడ్డీకి రుణంగా ఇచ్చేందుకు వీలుగా నిర్ణయం తీసుకున్నారు. ఈ పథకం అమలు కోసం రూ.250 కోట్లు ప్రతిపాదించారు. ఈ పథకం ద్వారా ఏడాదికి కనీసం 25 వేల మంది డ్వాక్రా మహిళల కుమార్తెలకు లబ్ధి చేకూరేలా అమలు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఇందు కోసం అర్హతలను నిర్ధారించారు. డ్వాక్రా సభ్యురాలిగా ఆరేళ్లు దాటిన మహిళల కుమార్తెలు ఈ పథకానికి అర్హులుగా నిర్ణయించారు. వారి అవసరం మేరకు రూ 10 వేల నుంచి లక్ష రూపాయల వరకు 4శాతం వడ్డీకి రుణం మంజూరు చేస్తారు. గరిష్టంగా 48 వాయిదాల్లో తీసుకున్న రుణాన్ని చెల్లించాల్సి ఉంటుంది. కాగా స్త్రీనిధి, బ్యాంకు లింకేజీ, ఉన్నతి, ఇతర మార్గాల్లో తీసుకున్న అప్పు సక్రమంగా చెల్లించే వారికి మాత్రమే కల్యాణలక్ష్మి పథకం కింద రుణం ఇస్తారు. స్థానిక వెలుగు కార్యాలయం లేదా వీవోఏ, యానిమేటర్ ద్వారా గానీ ఈ పథకానికి అప్లై చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నారు. లబ్ధిదారు బయోమెట్రిక్ అథెంటికేషన్ ఆధారంగా సంబంధిత అధికారులు పథకాన్ని అమలు చేసేందుకు నిర్ణయించారు.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org