Ad Code

కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడిపై పొక్సో కేసు నమోదు : 'హనీట్రాప్' చేసి బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని పోలీసులను ఆశ్రయించిన మంత్రి కుమారుడు


హైదరాబాద్‌లోని కొంపల్లికి చెందిన ఒక కుటుంబం తనను 'హనీట్రాప్' చేసి బ్లాక్‌మెయిల్ చేస్తోందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బందీ భగీరథ్ పోలీసులను ఆశ్రయించారు. అయితే, దీనికి ప్రతిగా సదరు బాలిక కుటుంబం కూడా భగీరథ్‌పై ఫోక్సో చట్టం కింద పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో కౌంటర్ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ పరిణామం ఇప్పుడు రాజకీయ మరియు సామాజిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. భగీరథ్ తన ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం ఒక ఉమ్మడి స్నేహితుడి ద్వారా తనకు ఆ బాలికతో పరిచయం ఏర్పడిందని, స్నేహం నెపంతో ఆ కుటుంబం తనను, తన స్నేహితులను వివిధ కుటుంబ వేడుకలకు, ఆధ్యాత్మిక యాత్రలకు ఆహ్వానించేవారని ఆయన తెలిపారు. అందరం కలిసి విజయవాడ, అరుణాచలం, తిరుమల వంటి పుణ్యక్షేత్రాలకు కూడా వెళ్లామని పేర్కొన్నారు. అయితే, కొంతకాలం తర్వాత వారి ప్రవర్తన మారిందని, ఆ బాలికను వివాహం చేసుకోవాలని ఆమె తల్లిదండ్రులు ఒత్తిడి చేయడం ప్రారంభించారని భగీరథ్ ఆరోపించారు. తాను వివాహానికి నిరాకరించడంతో, ఆ కుటుంబం తనపై అసత్య ఆరోపణలు చేస్తూ బ్లాక్‌మెయిల్ చేయడం మొదలుపెట్టిందని భగీరథ్ ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. "పెళ్లి చేసుకోకపోతే వేధింపుల కేసు పెడతామని బెదిరించారు. అంతేకాకుండా భారీ మొత్తంలో డబ్బు డిమాండ్ చేశారు. భయంతో నేను ఇప్పటికే వారి తండ్రికి రూ. 50 వేలు ఇచ్చాను. అయినప్పటికీ వేధింపులు తగ్గలేదు. రూ. 5 కోట్లు ఇవ్వకపోతే బాలిక తల్లి ఆత్మహత్య చేసుకుంటుందని నన్ను మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నారు" అని ఆయన ఫిర్యాదులో వివరించారు. తన స్నేహితులకు కూడా గతంలో ఈ కుటుంబంతో ఇబ్బందులు ఎదురయ్యాయని, వారిపై నిర్మల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా ఉందని ఆయన గుర్తు చేశారు. మరోవైపు, మే 8వ తేదీన సదరు బాలిక కుటుంబ సభ్యులు భగీరథ్‌పై తీవ్రమైన ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సదరు బాలిక మైనర్ అని పేర్కొంటూ ఆమె పట్ల భగీరథ్ అనుచితంగా ప్రవర్తించాడనే ఆరోపణలతో ఫోక్సో చట్టం కింద కేసు నమోదైంది. ప్రస్తుతం పోలీసులు రెండు వైపుల ఫిర్యాదులను స్వీకరించి విచారణ చేపట్టారు. 

Post a Comment

0 Comments

Close Menu