పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని మంగళవారం కొన్ని కొత్త కార్యక్రమాలను ప్రకటించారు. వాటిల్లో తక్కువ ధరలో చేప కూరతో భోజనం అందించే పథకాన్ని కూడా తీసుకొస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం వారానికి రెండు సార్లు సుమారు 400 ప్రత్యేక క్యాంటీన్లలో రూ.5కే ఫిష్ రైస్ మీల్స్ అందిస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు. అలాగే, అన్నపూర్ణ యోజన, మద్యం దుకాణాలపై నిబంధనలు, ప్రత్యేక ఆయుష్ శాఖను కూడా ఆయన ప్రకటించారు. సువేందు అధికారి మాట్లాడుతూ మే 27 నుంచి అన్నపూర్ణ యోజన దరఖాస్తు పత్రాల పంపిణీ ప్రారంభమవుతుందని చెప్పారు. ఈ పథకం కింద మహిళలకు నెలకు రూ.3,000 అందిస్తామని తెలిపారు. పాఠశాలలు, కళాశాలలు, ప్రార్థనా స్థలాలకు కిలోమీటర్ పరిధిలో మద్యం దుకాణాలకు అనుమతి ఇవ్వబోమని చెప్పారు. అన్నపూర్ణ యోజన దరఖాస్తు పత్రాలు రాష్ట్ర సచివాలయం నుంచి అందిస్తాం. ఈ పథకం ప్రయోజనాలు పొందేందుకు భారతీయులందరికీ అర్హత ఉంటుందని కల్యాణి, నాడియా జిల్లాలో జరిగిన పరిపాలనా సమావేశం అనంతరం సువేందు అధికారి మీడియాతో చెప్పారు. ప్రత్యేక ఆయుష్ శాఖను కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇందులో ఆయుర్వేదం, యోగా, యునానీ, సిద్ధ, హోమియోపతి ఉంటుంది.
0 Comments