పంట వ్యర్థాలను తగలబెట్టడం రైతుల భవిష్యత్తుకే ప్రమాదమని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హెచ్చరించారు. పంట అవశేషాలను కాల్చడం వల్ల భూసారం పూర్తిగా దెబ్బతింటుందని, నేలలోని పోషకాలు తగ్గిపోవడంతో యూరియా, పురుగుమందుల ప్రభావం కూడా తగ్గిపోతుందని మంత్రి తెలిపారు. అందువల్ల పంట అవశేషాలను కాల్చకుండా భూమిలో కలియదున్నాలని రైతులకు సూచించారు. రైతులకు సబ్సిడీపై వ్యవసాయ యంత్రాలు అందజేస్తామని మంత్రి వెల్లడించారు. అయినప్పటికీ పంట అవశేషాలను కాల్చితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే ఈ విషయంలో నిర్లక్ష్యం వహించే అధికారులపై కూడా చర్యలు తప్పవని స్పష్టం చేశారు. శాటిలైట్ సాంకేతికత ద్వారా పంట అవశేషాల దహనాన్ని గుర్తిస్తున్నామని తెలిపారు. రైతులకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. యూరియా సరఫరా విషయంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని మంత్రి తుమ్మల ఆరోపించారు. యుద్ధ ప్రభావంతో యూరియా సరఫరాలో అంతరాయం ఏర్పడిందని పేర్కొన్నారు. ఖరీఫ్ సీజన్‌కు ముందే కేంద్రాన్ని పలుమార్లు కోరినా సరఫరా సమస్య కొనసాగుతోందన్నారు. యూరియా సరఫరా పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంటుందని చెప్పారు. రాష్ట్రంపై బీజేపీ చేస్తున్న విమర్శలు అన్యాయమని మంత్రి వ్యాఖ్యానించారు. ఎల్‌నినో ప్రభావంతో సాధారణంగా పడే వర్షాలు తగ్గే అవకాశం ఉందని మంత్రి హెచ్చరించారు. అందువల్ల రైతులు పంటల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆయిల్ పామ్ రైతులకు భరోసా ఇచ్చే పంటగా మారుతోందని మంత్రి తెలిపారు. ఆయిల్ పామ్ సాగుతో రైతులు స్థిరమైన ఆదాయం పొందే అవకాశం ఉందని చెప్పారు. రైతు సంక్షేమానికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు.
0 Comments