తెలంగాణ లోని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా శామీర్ పేట్ ఎమ్మెఆర్వో సుచరిత ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. భూమి నాలా కన్వెర్షన్‌కి సుచరిత ఎకరాకు లక్షరేట్ కార్డ్ ఫిక్స్ చేశారు. 30ఎకరాల భూమి కన్వెర్షన్‌కి 30లక్షలు డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా అడ్వాన్స్‌గా సుచరిత కారు డ్రైవర్ రూ.2లక్షలు తీసుకున్నారు. ఆ డబ్బును సుచరితకు ఇస్తుండగా ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. డబ్బు గురించి ప్రశ్నింగా సుచరిత, ఆమె డ్రైవర్ నీళ్లు నమిలారు. ఎమ్మార్వో సుచరిత శామీర్‌పేట్ ఆఫీస్‌నే అవినీతికి అడ్డాగా మార్చారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మధ్యాహ్నం నుంచి ఏసీబీ తనిఖీలు కొనసాగుతున్నాయి. రంగారెడ్డి ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ నేతృత్వంలో ఈ తనిఖీలు చేపట్టారు. అనంతరం మీడియాతో ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ మాట్లాడుతూ శామీర్‌పేట మండలం ఆలియాబాద్ ప్రాంతంలో సుమారు 30 ఎకరాల భూమి కన్వర్షన్‌కు సంబంధించి రైతు కన్సల్టెంట్ నుంచి భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్ చేసినట్లు వచ్చిన ఫిర్యాదుల మేరకు విచారణ చేపట్టినట్లు వెల్లడించారు. ఎకరానికి రూ.1 లక్ష చొప్పున మొత్తం రూ.30 లక్షలు డిమాండ్ చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని తెలిపారు. ఈ వ్యవహారంలో తహసీల్దార్ డ్రైవర్ ద్వారా రూ.2 లక్షలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కార్యాలయంలోని కీలక పత్రాలు, భూ అనుమతులకు సంబంధించిన రికార్డులను స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నామని, ఎమ్మార్వో సుచరితతో పాటు ఆర్డీఓ కీసర రాజేష్ పలువురు సిబ్బందిని విచారిస్తున్నామని తెలిపారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని ఏసీబీ అధికారులు పేర్కొన్నారు.
0 Comments